Tilak Varma: దూసుకెళ్తున్న తెలుగు కుర్రాడు.. వరల్డ్ కప్‌లో ఉంటాడా? (వీడియో)

by Vinod kumar |   ( Updated:2023-10-10 14:50:31.0  )
Tilak Varma: దూసుకెళ్తున్న తెలుగు కుర్రాడు.. వరల్డ్ కప్‌లో ఉంటాడా? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్‌లో కొత్త స్టార్‌ రెడీ అవుతున్నాడు అంటూ, ఈ మధ్య తిలక్‌ వర్మ గురించి తెగ చర్చ జరుగుతోంది. అనుకున్నట్లుగా ఆసియా కప్‌ జట్టులో ఎంపికయ్యాడు. నెక్స్ట్‌ ఏంటి? ప్రపంచ కప్‌ జట్టులో స్థానమేనా? తిలక్ వర్మ.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఈ పేరే హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్‌‌లో అదరగొట్టి 20 ఏళ్లకే భారత టీ20 జట్టులోకి వచ్చేసిన ఈ హైదరాబాద్ కుర్రాడు.. ఇప్పుడు వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌‌లో తలపడే వన్డే జట్టుకు తిలక్ ఎంపిక కావడంతో, ఆ తర్వాత జరిగే ప్రపంచకప్‌‌లోనూ అతణ్ని చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా తక్కువ కాలంలోనే తిలక్ వర్మ ఎదిగిన తీరు ఇప్పుడు భారత క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

140 కోట్ల జనాభా ఉన్న దేశం మనది. ఈ దేశంలో అత్యధిక మంది ఆడే ఆట క్రికెట్. గల్లీ క్రికెట్‌తో మొదలుపెడితే ఈ ఆట ఆడేవాళ్లు కోట్లల్లో ఉంటారు. క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకుని ఆ దిశగా కష్టపడేవాళ్లయితే లక్షల్లో ఉంటారు. ఇంతమందిలోంచి జాతీయ జట్టులోకి ఎంపిక కావడం అంటే చిన్న విషయం కాదు. ప్రతిభకు అదృష్టం కూడా తోడై.. అలాగే సరైన అవకాశం లభించి.. ముందంజ వేసేవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. హైదరాబాద్ నుంచి ఇలా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ఆటగాళ్లు అరుదైపోయారు. మహ్మద్ సిరాజ్ తర్వాత మళ్లీ భారత జెర్సీలో కనిపిస్తున్న ఈ ఆటగాడే తిలక్ వర్మ.

సిరాజ్ లాగే తిలక్‌ది కూడా హైదరాబాద్‌కు చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబం. అతడి తండ్రి నాగరాజు వర్మ ఎలక్ట్రీషియన్. తల్లి గృహిణి. తిలక్‌కు చిన్నతనంలోనే క్రికెట్ మీద ఆసక్తి కలిగింది. 11 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ కోచ్ సలీం దృష్టిలో పడ్డాడు. ఆయన తిలక్‌కు లింగంపల్లిలోని ఒక అకాడమీలో శిక్షణ ఇచ్చాడు. రోజూ 20 కిలోమీటర్లు ప్రయాణించి క్రికెట్ సాధన సాగించేవాడు తిలక్. ముందుగా స్కూల్ లీగ్స్‌లో సత్తా చాటి, ఆ తర్వాత హైదరాబాద్‌ తరఫున 2018–19 సీజన్లో 16 ఏళ్లకే రంజీలోకి అరంగేట్రం చేశాడు. తొలి సీజన్లోనే ఏడు మ్యాచ్‌లలో 215 పరుగులు చేశాడు. తర్వాత టీ20 ఫార్మాట్లో జరిగే ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అదరగొట్టాడు. లిస్ట్-ఎ క్రికెట్లోనూ అడుగు పెట్టి అందులోనూ ఆకట్టుకున్నాడు.

ధీటుగా బ్యాటింగ్ చేయడంతో పాటు పార్ట్ టైం స్పిన్‌తోనూ సత్తా చాటిన తిలక్ మీద ముంబయి ఇండియన్స్ దృష్టిపడింది. 2022 సీజన్ ముంగిట జరిగిన వేలంలో రూ.20 లక్షల ప్రాథమిక ధరకు తిలక్‌ను కొనుగోలు చేసింది ముంబయి. అంతే కాదు, అతడికి తుది జట్టులోనూ చోటిచ్చింది. తొలి సీజన్లోనే 14 మ్యాచ్‌ల్లో 36కు పైగా సగటుతో 303 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ.. 11 మ్యాచ్‌ల్లో 43 సగటుతో 200కు పైగా పరుగులు సాధించాడు. మిడిలార్డర్లో ఒత్తిడి మధ్య బ్యాటింగ్ చేస్తూ, బౌలర్లను అతను ఎదుర్కొన్న తీరు ప్రశంసలు అందుకుంది.

పరిస్థితులకు తగ్గట్లు సంయమనంతోనూ ఆడగలడు. అదే సమయంలో విధ్వంసమూ సృష్టించగలడు. లెఫ్ట్ హ్యాండర్ కావడం కూడా అతడికి అడ్వాంటేజ్ అయింది. ఎంతోమంది మాజీల ప్రశంసలు అందుకున్న అతను, ఇటీవలే ముగిసిన వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్కడ కూడా తనపై ఉన్న అంచనాలకు తగ్గట్లే 5 మ్యాచ్‌ల్లో 173 పరుగులు చేసి మెప్పించాడు. ఆ ప్రదర్శనే ఇప్పుడు ఆసియా కప్ వన్డే జట్టులోనూ చోటు దక్కేలా చేసింది.

తిలక్ వర్మ ఇంత వేగంగా ఎదుగుతాడని.. ప్రపంచకప్‌ రేసులోకి వస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఐతే అతడి నిలకడ.. బ్యాటింగ్‌లో పరిణతి చూశాక.. ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తే జట్టుకు ఎంతో ఉపయోగపడతాడన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. చాలామంది మాజీలు తిలక్ కోసం గళం వినిపించారు. వన్డే జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లుగా ఉన్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధ పడుతుండటం తిలక్‌కు కలిసొచ్చే విషయం. వాళ్లిద్దరూ కూడా ఆసియా కప్‌కు ఎంపిక అయినప్పటికీ, పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన సంకేతాలు కనిపించడం లేదు.

ఆసియా కప్‌లో వాళ్లు ఫిట్‌నెస్‌, ఫామ్ చాటుకోకుంటే వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక కావడం కష్టమే. నాలుగో స్థానంలో చాన్నాళ్లుగా నిలకడైన ఆటగాడు లేక ఇబ్బంది పడుతోంది భారత్. తిలక్ అందుకు సరైన ప్రత్యామ్నాయంలా కనిపిస్తున్నాడు. శ్రేయస్ కనుక ప్రపంచకప్‌నకు అందుబాటులో లేకపోతే తిలక్ ఎంపికయ్యేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి అన్నట్లే. ఐతే ముందు అతడికి ఆసియా కప్ తుది జట్టులో చోటు దక్కుతుందా అన్నది ప్రశ్న. ఆ అవకాశం లభించి తిలక్ కనుక సత్తా చాటితే అతణ్ని ప్రపంచకప్‌లో చూడొచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఒక తెలుగు కుర్రాడు ఇండియా తరపున వరల్డ్ కప్ ఆడితే గర్వకరణమనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed