ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లోనే టీమ్ ఇండియా బ్యాటర్..

by Vinod kumar |
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లోనే టీమ్ ఇండియా బ్యాటర్..
X

న్యూఢిల్లీ: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్య 906 రేటింగ్ పాయింట్లతో టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచ్‌లతో సూర్య బిజీగా ఉండగా.. అతని పొజిషన్‌కు దరిదాపుల్లో కూడా మరో బ్యాటర్ లేడు. పాక్ ఓపెనర్ రిజ్వాన్ 811 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి సూర్య మాత్రమే టాప్-10లో ఉన్నాడు.

కోహ్లీ 15వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. కేఎల్ రాహుల్ 30వ, రోహిత్ 32వ, గిల్ 34వ ర్యాంక్‌లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో భారత్ నుంచి ఒక్కరు కూడా ప్రాతినిధ్యం వహించకపోవడం గమనార్హం. ఒక స్థానాన్ని ఎగబాకి 13వ ర్యాంక్‌‌కు చేరుకున్న అర్ష్‌దీప్ సింగ్.. భారత్ నుంచి టాప్ ర్యాంక్ బౌలర్‌గా ఉన్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ (18), అశ్విన్ (27), అక్షర్ పటేల్ (28) ఉన్నారు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ స్టార్ షకీబ్ అల్ హసన్ టాప్‌లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో కొనసాగుతుండగా.. షకీబ్ కంటే 19 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు.

Advertisement

Next Story