టీమ్ ఇండియా బౌలింగ్ బలంగా లేదు.. అందుకే ఇలాంటి పిచ్‌లు: సునీల్ గవాస్కర్

by Vinod kumar |
టీమ్ ఇండియా బౌలింగ్ బలంగా లేదు.. అందుకే ఇలాంటి పిచ్‌లు: సునీల్ గవాస్కర్
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ పిచ్ పై బోల్తా పడటం తెలిసిందే. అయితే ఈ పిచ్‌కు ఐసీసీ చెత్త పిచ్ అనే రేటింగ్ ఇవ్వడంతో పిచ్‌లపై చర్చ మరో స్థాయికి చేరింది. తాజాగా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. భారత జట్టుపై మండిపడ్డాడు. టీమ్ ఇండియా బౌలింగ్ బలంగా లేదు.. అందుకే ఇలాంటి పిచ్‌లు తయారు చేస్తున్నారంటూ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియాలో 20 వికెట్లు తీయడం అంత సులువు కాదని అన్నాడు. టీమ్ ఇండియా జట్టు బౌలింగ్ ఎటాక్ చాలా బలహీనంగా ఉందని.. అందుకే ఇలా స్పిన్ పిచ్‌లు తయారు చేయిస్తున్నారని అతడు అనడం గమనార్హం.

"డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇండియా వెళ్లాలంటే వాళ్లకు ఇలాంటి స్పిన్ పిచ్‌లు తయారు చేయడం తప్ప మరో మార్గం లేదు. బౌలింగ్ ఎటాక్ బలంగా ఉంటే మరో దారి ఆలోచించవచ్చు. కానీ, మీ ప్రధాన బలం స్పిన్నర్లే. అందుకే ఇలాంటి పిచ్ లు తయారు చేస్తున్నారు. ఫ్లాట్ పిచ్ లు తయారు చేస్తే బ్యాటర్లు డామినేట్ చేస్తారు. కానీ ఈ పిచ్ లు బ్యాటర్లకు పరీక్ష పెడుతున్నాయి" అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా అందుబాటులో లేకుండా పోయాడు. అతడు మరో ఆరు నెలల జట్టులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. మార్చి 9 నుంచి చివరి టెస్టు అహ్మదాబాద్‌లో జరగనుంది. ఆ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. లేదంటే శ్రీలంక, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.

Advertisement

Next Story