అదరగొట్టిన యువ షట్లర్ తన్వి.. ఆసియా అండర్-15 సింగిల్స్ టైటిల్ కైవసం

by Harish |
అదరగొట్టిన యువ షట్లర్ తన్వి.. ఆసియా అండర్-15 సింగిల్స్ టైటిల్ కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : భారత యువ షట్లర్ తన్వి పత్రి అదరగొట్టింది. ఆసియా అండర్-15 గర్ల్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. చైనా వేదికగా జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ అండర్-17, 15 జూనియర్ చాంపియన్‌షిప్‌లో తన్వి సంచలన ప్రదర్శన చేసింది. మొదటి మ్యాచ్‌ నుంచి సత్తాచాటిన ఆమె ఫైనల్‌లో జోరు ప్రదర్శించింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో తన్వి 22-20, 21-11 తేడాతో వియత్నం క్రీడాకారిణి న్గుయెన్‌పై విజయం సాధించింది.

ఫైనల్‌లో తన్వి అద్భుతమైన నైపుణ్యాలు, పట్టుదల ప్రదర్శించింది. తొలి గేమ్‌లో 17-11తో వెనుకబడిన సమయంలో తన్వి పుంజుకున్న తీరు అద్భుతం. ప్రత్యర్థి తప్పిదాలను సద్వినియోగం చేసుకుని వరుస పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకుంది. ఇక, రెండో గేమ్‌లో తన్వి దూకుడును వియత్నం షట్లర్ అడ్డుకోలేకపోయింది. దీంతో 34 నిమిషాల్లోనే తన్వి రెండు గేమ్‌లను నెగ్గి టైటిల్స్‌ను గెలుచుకుంది. టోర్నీలో తన్వి ప్రతి మ్యాచ్‌ను రెండు గేముల్లోనే ముగించడం విశేషం.

ఆసియా అండర్-15 టైటిల్ గెలిచిన మూడో భారత షట్లర్‌గా తన్వి నిలిచింది. ఆమె కంటే ముందు సమియా ఇమాద్ ఫరూఖీ(2017), తస్నిమ్ మిర్(2019) చాంపియన్‌గా నిలిచారు.అలాగే, ఈ టోర్నీలో భారత్ స్వర్ణం, కాంస్యంతో ముగించింది. తెలంగాణ కుర్రాడు జ్ఞానదత్తు అండర్-17 బాయ్స్ సింగిల్స్‌లో కాంస్యం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story