అలాంటి ఇన్నింగ్స్ ఆడాలి :Suryakumar Yadav

by Vinod kumar |
అలాంటి ఇన్నింగ్స్ ఆడాలి :Suryakumar Yadav
X

న్యూఢిల్లీ : వన్డేల్లో విఫలమవుతున్నాడన్న విమర్శలకు టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ గట్టి సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో సత్తాచాటి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒకవైపు బౌండరీలతో అలరిస్తూనే.. మరోవైపు ఓపికతో బ్యాటింగ్ చేస్తూ క్రీజులో పాతుకపోయాడు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ.. ఏం జరిగిందో అనే దానిపై ఆశ్చర్యంగా ఉందన్నాడు. ‘బంతి రంగు ఒకటే. అదే జట్టు. బౌలర్లు కూడా వారే. కొంచెం తొందరపడుతున్నానని నాకనిపించింది. ఇంకాస్త సమయం తీసుకుందామనుకుని నన్ను నేను శాంతించుకున్నా. లోతుగా బ్యాటంగ్ చేయడానికి ప్రయత్నించాను.’ అని సూర్య చెప్పాడు. అలాగే, తన డ్రీమ్ ఇన్నింగ్స్‌ గురించి వివరించాడు. ‘వన్డే ఫార్మాట్‌లో ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి చివరి వరకూ బ్యాటింగ్ చేయాలని, జట్టుకు ముగింపు అందించాలని కలలు కనేవాడిని. నేను అలా చేయలేకపోయాను. కానీ ఈ మ్యాచ్‌లో నా పాత్రను ఇష్టపడతాను.’ అని తెలిపాడు.

కెప్టెన్ కేఎల్ రాహుల్(58)తో కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించిన సూర్యకుమార్.. మరో 12 పరుగులు కావాల్సి ఉండగా పెవిలియన్ చేరాడు. వన్డే ప్రపంచకప్‌కు ముందు సూర్య వన్డేల్లో ఫామ్ అందుకోవడం టీమ్ ఇండియాకు కలిసొచ్చే అంశం. మరోవైపు, సూర్యకుమార్‌పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. సూర్యలాగే ఆడే సామర్థ్యం చాలా మంది ఆటగాళ్లలో లేదని, అతను ప్రత్యర్థి జట్లు భయపడేలా ఆడతాడని కొనియాడాడు. టీమ్ ఇండియాకు సూర్య బలమని, ప్రపంచకప్‌లో అతను కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాడని చెప్పాడు.

Advertisement

Next Story