దూకుడుగా ఆడతాం : ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్

by Harish |
దూకుడుగా ఆడతాం : ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 సీజన్‌‌ను దూకుడుగా ప్రారంభిస్తామని సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఈ నెల 23న కోల్‌కతాతో తలపడటం ద్వారా హైదరాబాద్ జట్టు టోర్నీని మొదలుపెట్టనుంది. గురువారం కమిన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఎస్‌ఆర్‌హెచ్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో ఓపెనింగ్ మ్యాచ్ గురించి కమిన్స్ మాట్లాడుతూ..‘కోల్‌కతా బలమైన జట్టు. శుభారంభం చేయాలనుకుంటున్నాం. అందుకోసం ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. ఈ సీజన్‌ను దూకుడుగా ఆరంభిస్తాం.’ అని చెప్పాడు.

అలాగే, జట్టు గురించి మాట్లాడుతూ.. ‘సీనియర్లతో, యువకులతో జట్టు బాగుంది. భువనేశ్వర్, ఎయిడెన్ మార్‌క్రమ్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. అలాగే, అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి ప్రతిభ కలిగిన యువకులు ఉన్నారు. ఈ సీజన్‌లో అభిమానులను ఉత్సాహంగా ఉంచుతాం.’ అని తెలిపాడు. ‘ఇంతకుముందు జట్టు సభ్యులు పెద్దగా తెలియదు. ఇప్పుడు వాళ్లతోనే పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి, వారి గురించి తెలుసుకుంటా. వారికి నా నుంచి ఏం కావాలో తెలుసుకుంటా.’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story