నా జీవితంలో ఎదురుదెబ్బలే ఎక్కువ : రోహిత్ శర్మ

by Harish |
నా జీవితంలో ఎదురుదెబ్బలే ఎక్కువ : రోహిత్ శర్మ
X

దిశ, స్పోర్ట్స్ : తన కెరీర్‌లో ఎదురుదెబ్బలే ఎక్కువ అని, వాటి వల్లే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాజాగా దుబాయ్ ఐ 103.8 రేడియో స్టేషన్‌లో రోహిత్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రిటైర్మెంట్ వార్తలపై స్పందిస్తూ..మరికొన్నేళ్లు ఆడాలనుకుంటున్నట్టు చెప్పాడు. వరల్డ్ క్రికెట్‌లో సత్తాచాటాలని ఉందన్నాడు. ‘క్రికెట్‌తో నాకు 17 ఏళ్ల బంధం. ఈ ప్రయాణం అద్భుతం. ఉన్నతస్థాయికి చేరుకోవడం అంత సులభం కాదు. నా జీవితంలో ఎదురుదెబ్బలే ఎక్కువగా చూశాను. ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా నేను ఇక్కడ ఉన్నానంటే గతంలో నేను చూసిన పతనాలే కారణం. నేను కెరీర్ ప్రారంభించినప్పుడు జట్టుపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఒక వ్యక్తిగా, ఒక ఆటగాడిగా ‘నాకు ఏం కావాలి, నేను ఏం చేయగలను’ అని నాకు నేనే ప్రశ్నించుకున్న సందర్భాలు ఉన్నాయి.’అని తెలిపాడు.

టీమ్ ఇండియాకు కెప్టెన్ అవుతానని ఊహించలేదని, ఆ అవకాశం దక్కడం తనకు అతిపెద్ద గౌరవమని చెప్పాడు. మంచి వ్యక్తులకు అంతా మంచే జరుగుతుందని అంటుంటారని, తన విషయంలో అదే జరిగిందన్నాడు. ‘భారత క్రికెట్‌పై గత కెప్టెన్లు ఎలాంటి ప్రభావం, వారు వదిలివెళ్లిన వారసత్వం గురించి నాకు తెలుసు. జట్టు సరైన దిశలోనే వెళ్తుంది. నేను కెప్టెన్ అయిన తర్వాత ఆటగాళ్లందరూ ఒక దిశలోనే నడవాలని కోరుకున్నాను. వ్యక్తిగత గణాంకాల కోసం కాకుండా జట్టుగా ఎలా ఆడాలన్నది దానిపై ఫోకస్ పెట్టాం.’ అని చెప్పుకొచ్చాడు.

ఒత్తిడిని అధిగమించడంపై మాట్లాడుతూ.. తన జీవితంలో ఒత్తిడి కీలక పాత్ర పోషిస్తుందని, దాన్ని సానుకూలంగా తీసుకుంటానని చెప్పాడు. ‘కొన్నిసార్లు మన బలాలను గుర్తించలేం. ఒత్తిడిలో ఉన్నప్పుడు మన సామర్థ్యాలను బయటకు తీసుకరావడానికి ప్రయత్నించాలి.’ అని చెప్పాడు. అలాగే, సౌతాఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ తాను ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్ అని తెలిపాడు. ‘నేను బ్యాటింగ్‌‌కు వెళ్లేముందు అతని వీడియోలను 100 సార్లు చూసేవాడిని. వేగంతోపాటు బంతిని స్వింగ్ చేసేవాడు. అది అంతా సులభం కాదు. అతనితో పోటీని ఆస్వాదించేవాడిని.’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story