బుమ్రా, స్మృతి మంధాన తర్వాత ఆ ఘనత సాధించిన శ్రీలంక క్రికెటర్లు

by Harish |   ( Updated:2024-09-16 19:56:13.0  )
బుమ్రా, స్మృతి మంధాన తర్వాత ఆ ఘనత సాధించిన శ్రీలంక క్రికెటర్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఆగస్టుకు సంబంధించిన ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు పురుషుల, మహిళల కేటగిరీల్లో శ్రీలంక క్రికెటర్లనే వరించింది. అవార్డు విజేతలను ఐసీసీ సోమవారం ప్రకటించింది. పురుషుల కేటగిరీలో శ్రీలంక ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే అవార్డు గెలుచుకున్నాడు. రేసులో ఉన్న కేశవ్ మహారాజ్(సౌతాఫ్రికా), జేడెన్ సీల్స్(వెస్టిండీస్)లను వెనక్కినెట్టి అవార్డు సాధించాడు. ఆగస్టు నెలలో అతను ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 108 రన్స్‌తోపాటు 7 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది కామెందు మెండిస్ తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్‌’గా గెలిచిన రెండో శ్రీలంక ప్లేయర్‌ వెల్లలాగే.

మరోవైపు, మహిళల కేటగిరీలో శ్రీలంక మహిళల జట్టు టాపార్డర్ బ్యాటర్ హర్షిత మాదవి ఈ అవార్డును కైవసం చేసుకుంది. మహిళల కేటగిరీలో చివరి నాలుగు నెలల్లో మూడు అవార్డులు శ్రీలంక క్రికెటర్లనే వరించడం గమనార్హం. హర్షిత కంటే ముందు మే, జూలై నెలల్లో చమరి ఆటపట్టు అవార్డు సాధించింది. ఆగస్టులో ఐర్లాండ్‌ పర్యటనలో హర్షిత టీ20, వన్డే సిరీస్‌ల్లో సత్తాచాటింది. రెండు టీ20ల్లో వరుసగా హాఫ్ సెంచరీలు(86, 65) చేసిన ఆమె.. రెండో వన్డేలో సెంచరీ బాదింది. ఒకే నెలలో ఒకే దేశానికి చెందిన క్రికెటర్లకు పురుషుల, మహిళల కేటగిరీల్లో అవార్డు దక్కడం చాలా అరుదు. ఐసీసీ మంత్ అవార్డ్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతకుముందు ఇలా ఒకేసారి జరిగింది. ఇదే ఏడాది జూన్‌ నెలకు సంబంధించి భారత్ నుంచి బుమ్రా, స్మృతి మంధాన అవార్డులు దక్కించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed