ఒక్కరోజే 23 వికెట్లు పడగొట్టారు

by Swamyn |
ఒక్కరోజే 23 వికెట్లు పడగొట్టారు
X

దిశ, స్పోర్ట్స్: సౌతాఫ్రికా, భారత్ జట్ల మధ్య బుధవారం ప్రారంభమైన రెండో టెస్టు రసవత్తరంగా మారింది. కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్.. తొలి రోజే అనూహ్య మలుపులు తిరిగింది. పేసర్లకు స్వర్గధామంగా మారిన ఇక్కడి పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు దుమ్మురేపారు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించారు. బంతిని టచ్ చేస్తే క్యాచ్ అవుట్.. ఆడకుండా వదిలేద్దామంటే బౌల్డ్. దీంతో బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఇంకేముంది? వచ్చినోళ్లు.. వచ్చినట్టు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఇరు జట్ల బౌలర్లు కలిసి ఒక్కరోజే 23 వికెట్లు పడగొట్టారు. అయితే, పిచ్ పరిస్థితులను మన హైదరాబాదీ మియా భాయ్ సిరాజ్ మరింత అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా జట్టును అత్యంత స్వల్ప స్కోరుకే కూల్చేశాడు. దీంతో తొలుత టీమ్ ఇండియానే సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. కానీ, దాన్ని బ్యాటింగ్‌లో ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయింది. ఆతిథ్య జట్టును తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 55కే ఆలౌట్ చేశామన్న ఆనందం.. భారత అభిమానుల్లో ఎంతోసేపు నిలవలేదు. మన బ్యాటర్లు కొద్దిసేపు ఆశలు రేపినా.. ఆ తర్వాత పెవిలియన్‌కు క్యూ కట్టారు. మొత్తంగా తొలి రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా స్కోరు 55/10. టీమ్ ఇండియా స్కోరు 153/10. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు 98 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం 62/3తో ఉంది. 98 పరుగుల ఆధిక్యాన్ని అందుకోవడానికి ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. రెండు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే తొలి టెస్టు ఓడిపోయిన టీమ్ ఇండియా.. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే రెండో రోజైన బుధవారం వీలైనంత తొందరగా సౌతాఫ్రికాను ఆలౌట్ చేయాలి. ఆ తర్వాత వికెట్లు పడగొట్టుకోకుండా లక్ష్యాన్ని ఛేదించాలి.

సిరాజ్ మియా.. అదిరిపోయే మాయ

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు.. మన హైదరాబాదీ సిరాజ్ మియా.. చుక్కలు చూపించాడు. బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేశామని పశ్చాత్తాపపడేలా చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. సిరాజ్‌ దూకుడుకు బుమ్రా, ముకేశ్ కుమార్ సైతం తోడవడంతో టీమ్ ఇండియా బౌలింగ్‌కు ఎదురేలేకుండా పోయింది. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో రెండో బంతికి ఓపెనర్ మార్‌క్రమ్‌ను క్యాచ్ అవుట్ చేసి.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను కూల్చేసే పనిని ప్రారంభించిన సిరాజ్.. దానిని చివరివరకూ కొనసాగించాడు. ఈ క్రమంలోనే ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో 23.2 ఓవర్లలోనే కేవలం 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ వెర్రేన్ చేసిన 15 పరుగులే దక్షిణాఫ్రికా జట్టులో అత్యధికం కావడం గమనార్హం. మిగతా వారంతా సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు.

కోహ్లీ ఒక్కడే..

ప్రత్యర్థి జట్టును వాళ్ల గడ్డపైనే స్వల్ప స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందం టీమ్ ఇండియాలో ఎంతోసేపు నిలవలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఓ 300కు పైగా పరుగులు చేసి ప్రత్యర్థి జట్టుకు టఫ్ కాంపిటీషన్ ఇస్తారని భావిస్తే.. భారత జట్టు సైతం బ్యాటింగ్‌లో తీవ్రంగా తడబడింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(0) మరోసారి నిరాశపరుస్తూ రబాడ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 17 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్‌తో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ జట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నించాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే బర్గర్ బౌలింగ్ రోహిత్(39) క్యాచ్ అవుట్‌ అయ్యాడు. ఇక, నాలుగో స్థానంలో వచ్చిన కోహ్లీ(46) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మరో ఎండ్‌లో ఉన్న గిల్ ఓ అనవసర షాట్ ఆడి బర్గర్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. దీంతో 105 పరుగుల వద్ద మూడో వికెట్ పడింది. ఆ తర్వాత వరుసగా వచ్చినవాళ్లు వచ్చినట్టు పెవిలియన్ బాట పట్టారు. కేఎల్ రాహుల్ క్రీజులో కుదురుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే 33 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, లుంగీ ఎన్గిడీ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. కోహ్లీ ఒక్కడే ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని నిలబడినప్పటికీ.. మరో ఎండ్‌ నుంచి అతనికి సహకారం లభించలేదు. ఈ క్రమంలోనే ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మొత్తంగా 34.5 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా.. 153 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 98 పరుగుల ఆధిక్యం సాధించింది. రోహిత్(39), గిల్(36), కోహ్లీ(43) టాప్ స్కోరర్లు. ప్రత్యర్థి బౌలర్లలో రబాడా, లుంగీ ఎన్గిడీ, బర్గర్ మూడేసి వికెట్లు పడగొట్టారు.

11 బంతుల్లో 6 వికెట్లు.. 0 రన్స్..

తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడుగురు భారత బ్యాటర్లు ఒక్క పరుగైనా చేయకుండానే డకౌట్‌ అవడం గమనార్హం. వీరిలో యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్, ముకేశ్ కుమార్ ఉన్నారు. ముఖ్యంగా చివరి 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా రాకుండా ఆరు వికెట్లు పడ్డాయి. 34వ ఓవర్ వేసిన లుంగీ ఎన్గిడీ.. ఆ ఒక్క ఓవర్‌లోనే మూడు వికెట్లు తీయగా, తర్వాతి ఓవర్లో మరో మూడు వికెట్లు పడ్డాయి.

రెండో ఇన్నింగ్స్‌లో..

టీమ్ ఇండియాను త్వరగానే అవుట్ చేసి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికాకు.. మరోసారి సరైన ఆరంభం లభించలేదు. ముకేశ్ రెండు వికెట్లు, బుమ్రా ఒక వికెట్‌తో చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ మార్‌క్రమ్(36*)తోపాటు డేవిడ్ బెడింగమ్(7) ఉన్నారు. భారత్‌ ఆధిక్యాన్ని అందుకోవడానికి ఇంకా 36 పరుగుల వెనుకబడి ఉంది.

స్కోరు బోర్డు:

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్‌క్రమ్ (సి) యశస్వి (బి) సిరాజ్ 2, ఎల్గర్ (బి) సిరాజ్ 4, టోనీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 2, స్టబ్స్ (సి) రోహిత్ (బి) బుమ్రా 3, బెడింగమ్ (సి) యశస్వి (బి) సిరాజ్ 12, వెర్రేన్ (సి) గిల్ (బి) సిరాజ్ 15, జాన్సన్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 0, మహరాజ్ (సి) బుమ్రా (బి) ముకేశ్ 3, రబాడ (సి) శ్రేయస్ (బి) ముకేశ్ 5, బర్గర్ (సి) యశస్వి (బి) బుమ్రా 4, లుంగీ ఎన్గిడీ 0నాటౌట్; ఎక్స్‌ట్రాలు:5, మొత్తం-55/10(23.3ఓవర్లు)

వికెట్ల పతనం: 5-1, 8-2, 11-3, 15-4, 34-5, 34-6, 45-7, 46-8, 55-9, 55-10

బౌలింగ్: బుమ్రా(8-1-25-2), సిరాజ్ (9-3-15-6), ప్రసిద్ధ్(4-1-10-0), ముకేశ్ (2.2-2-0-2)

టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: యశస్వీ జైశ్వాల్ (బి) రబాడ 0, రోహిత్ (సి) జాన్సెన్ (బి) బర్గర్ 39, గిల్ (సి) జాన్సెన్ (బి) బర్గర్ 36, కోహ్లీ (సి) మార్‌క్రమ్ (బి) రబాడ 46, అయ్యర్ (సి) వెర్రేన్ (బి) బర్గర్ 0, రాహుల్ (సి) వెర్రేన్ (బి) లుంగి ఎన్గిడి 8, జడేజా (సి) జాన్సెన్ (బి) లుంగి ఎన్గిడి 0, బుమ్రా (సి) జాన్సెన్ (బి) లుంగి ఎన్గిడి 0, సిరాజ్ (రనౌట్) బర్గర్ 0, ప్రసిద్ధ్ (సి) మార్‌క్రమ్ (బి) రబాడ 0, ముకేశ్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 24, మొత్తం-153/10(34.5ఓవర్లు)

వికెట్ల పతనం: 17-1, 72-2, 105-3, 110-4, 153-5, 153-6, 153-7, 153-8, 153-9, 153-10

బౌలింగ్: రబాడ(11.5-2-38-3), లుంగి ఎన్గిడి (6-1-30-3), బర్గర్ (8-2-42-3), జాన్సన్ (9-2-29-0)


సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 63/3(17ఓవర్లు)

మార్‌క్రమ్ (36 బ్యాటింగ్), ఎల్గర్ (సి) కోహ్లీ (బి) ముకేశ్ 12, టోని (సి) రాహుల్ (బి) ముకేశ్ 1, స్టబ్స్ (సి) రాహుల్ (బి) బుమ్రా 1, బెడింగమ్ (7 బ్యాటింగ్)

వికెట్ల పతనం: 37-1, 41-2, 45-3

బౌలింగ్: బుమ్రా (6-0-25-1), సిరాజ్ (5-2-11-0), ముకేశ్ (6-2-25-2)

Advertisement

Next Story

Most Viewed