షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ బోణీ.. సోనమ్ ఉత్తమ్‌కు రజతం

by Harish |
షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ బోణీ.. సోనమ్ ఉత్తమ్‌కు రజతం
X

దిశ, స్పోర్ట్స్ : న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్‌ఎస్ఎఫ్) వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ తొలి రోజే పతక బోణీ చేసింది. మహిళా షూటర్ సోనమ్ ఉత్తమ్ మస్కర్ తొలి పతకాన్ని అందించింది. మంగళవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రజతం గెలుచుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో సోనమ్ 632.1 స్కోరుతో 4వ స్థానంలో, మరో షూటర్ తిలోత్తమ సేన్(628.9) 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.

మెడల్ రౌండ్‌లోనూ సోనమ్ సత్తాచాటింది. 252.9 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ దక్కించుకుంది. తిలోత్తమ(167.7) 6వ స్థానంతోనే సరిపెట్టింది. చైనాకు చెందిన హువాంగ్ యుటింగ్(254.5) వరల్డ్ రికార్డు పర్ఫామెన్స్‌తో స్వర్ణం కైవసం చేసుకుంది. సౌత్ కొరియా షూటర్ క్వాన్ ఉంజి(209.9) కాంస్యం గెలుచుకుంది. సోనమ్‌కు ఇది రెండో వరల్డ్ కప్ మెడల్. జనవరిలో ఈజిప్ట్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో సోనమ్ అరంగేట్ర ప్రపంచకప్‌లోనే రజతం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.

మరోవైపు, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అర్జున్ బబుటా(188.3), దివ్యాన్ష్ సింగ్(124) 5వ, 8వ స్థానాలతో సరిపెట్టింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో అర్జున్ సింగ్(109.9) 8వ స్థానంతో ముగించగా.. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో రిథమ్ సంగ్వాన్(197.2) నాలుగో స్థానంలో నిలిచి తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది.

Advertisement

Next Story

Most Viewed