పుల్లపుకుంటలో మృతదేహం కలకలం...కుళ్లిన శవం లభ్యం

by Sridhar Babu |   ( Updated:2024-10-15 16:24:26.0  )
పుల్లపుకుంటలో మృతదేహం కలకలం...కుళ్లిన శవం లభ్యం
X

దిశ ,కల్లూరు : మండల పరిధిలోని రాళ్ల బంజర గ్రామానికి వెళ్లే దారిలో ఆర్ అండ్ బీ రహదారి పక్కన గల పుల్లప్పకుంట చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మంగళవారం పుల్లపుకుంట చెరువులో మత్స్యకారులు చేపలకు మేత వేస్తుండగా శవం కనిపించడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఎస్కే. షాకీర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని చెరువులో గోనె సంచిలో ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికుల సహకారంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉంది.

అనంతరం ఎస్ఐ కల్లూరు ఏసీపీ అనిశెట్టి రఘు, పెనుబల్లి రూరల్ సీఐ ముత్తు లింగయ్య, తహసీల్దార్ పులి సాంబశివుడికి సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ అనిశెట్టి రఘు మాట్లాడుతూ మృతదేహం కుళ్లిపోయిన పరిస్థితి గమనిస్తే వారం పది రోజుల క్రితమే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. జరిగింది హత్యనా, లేక ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. తహసీల్దార్ పులి సాంబశివుడు సమక్షంలో పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని శవపరీక్షకు పెనుబల్లి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story