అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు సారథిగా గిల్?

by Swamyn |
అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు సారథిగా గిల్?
X

దిశ, స్పోర్ట్స్ : ఈ మధ్య కాలంలో టీమ్ ఇండియాను ఒక్కో సిరీస్‌లో ఒక్కో కెప్టెన్‌ నడిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో టీ20 సిరీస్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు చూసుకున్నాడు.ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్టు జట్టును రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ నడిపిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ టీ20లకు దూరంగా ఉండటం, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో కెప్టెన్సీ మార్పు తప్పడం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌‌తో టీ20 సిరీస్‌లోనూ టీమ్ ఇండియా కొత్త కెప్టెన్‌ను చూడబోతున్నట్టు తెలుస్తోంది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భారత పగ్గాలు చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్ డిజిటిల్ బ్రాడ్‌కాస్టర్ జియో సినిమా తాజాగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు సంబంధించి ఓ ప్రొమోను రిలీజ్ చేసింది. ఈ ప్రొమో పోస్టర్‌ను గిల్ వర్సెస్ రషీద్ ఖాన్‌గా రూపొందించింది. అఫ్గాన్ టీ20 జట్టుకు స్పిన్నర్ రషీద్ ఖాన్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టును గిల్ నడిపిస్తాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. గాయపడిన పాండ్యా ఇంకా పూర్తిగా ఫిట్‌నెస్ సాధించలేదు. అతను నేరుగా ఐపీఎల్-2024లోనే పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దీంతో అఫ్గాన్‌తో సిరీస్‌కు అతను అందుబాటులో ఉండే చాన్స్‌లు లేవనే చెప్పొచ్చు. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక స్పష్టత వస్తేనే ఓ క్లారిటీ రానుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా.. ఈ టూరు ముగియగానే ఇదే నెలలో సొంతగడ్డపై అఫ్గాన్‌తో మూడు టీ20లు ఆడనుంది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్ ఆడుబోయే చివరి టీ20 సిరీస్ ఇదే. ఈ నెల 11న తొలి టీ20 జరగనుండగా.. 14, 17 తేదీల్లో మిగతా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.

Advertisement

Next Story