‘షకీబ్ ఇక నువ్వు మారవా?’..అభిమానిపై బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ దాడి

by Dishanational3 |
‘షకీబ్ ఇక నువ్వు మారవా?’..అభిమానిపై బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ దాడి
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌‌కు వివాదాలు కొత్తకాదు. మైదానంలో అంపైర్లు, ఆటగాళ్లతో గొడవ పడటం, మైదానం వెలుపల అభిమానులతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. తాజాగా షకీబ్ దురుసు ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచాడు. సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన అభిమానిపై దాడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బంగ్లాదేశ్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో సోమవారం జరిగిన షేక్ జమాల్ ధన్మొండి క్లబ్‌, ప్రైమ్ బ్యాంక్ క్రికెట్‌ క్లబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. షేక్ జమాల్ ధన్మొండి క్లబ్‌కు షకీబ్ ఆడుతున్నాడు. టాస్‌కు ముందు స్టేడియంలో ఉన్న షకీబ్ వద్దకు ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకోవడానికి వచ్చాడు. అతనితో షకీబ్ దురుసుగా ప్రవర్తించాడు. అతని మెడ పట్టుకుని ఫోన్ లాక్కునేందుకు చూశాడు. అంతటితో ఆగని షకీబ్‌ అతన్ని కొట్టేందుకు చేయి లేపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. షకీబ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఇక నువ్వు మారవా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story