చేతులు లేవు.. కానీ, గురి తప్పదు.. ఆర్చరీలో అద్భుతాలు

by Harish |
చేతులు లేవు.. కానీ, గురి తప్పదు.. ఆర్చరీలో అద్భుతాలు
X

న్యూఢిల్లీ: చేతులు లేకుండా బాణం గురిపెట్టడం సాధ్యమా?.. అసలు ఊహించగలమా?.. కానీ, జమ్మూ కశ్మీర్‌కు చెందిన శీతల్ దేవి మాత్రం ఓ అద్భుతమే. చేతులు లేకపోయినా ఆర్చరీలో ఆమె సంచలనాలు సృష్టిస్తున్నది. కాళ్లు, తల సహాయంతో బాణం గురి చూసి సంధిస్తున్నది. నైపుణ్యం, శ్రమ, పట్టుదల ఉంటే అసాధ్యమూ సుసాధ్యమే అని శీతల్ నిరూపించింది. చైనా వేదికగా జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో మూడు పతకాలు సాధించింది. అందులో రెండు స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో శీతల్ చాంపియన్‌గా అవతరించగా.. అంతకుముందు మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్ కాంపౌండ్ విభాగంలో రజతం గెలుచుకుంది.

జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లోని లోయిధర్ గ్రామంలో 16 ఏళ్ల శీతల్ దేవి జన్మించింది. ఆమె పుట్టుకతో ఫోకోమెలియా అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధితో బాధపడే వారిలో అవయవాలు అభివృద్ధి చెందవు. దీనివల్లే శీతల్ చేతులు అభివృద్ధి చెందలేదు. చిన్నతనంలో ఆమె చేతులు లేవని బాధపడేది. ఆ తర్వాత తన వైకల్యాన్ని జయించేలా క్రీడల వైపు వెళ్లాలనుకుంది.

వైద్యులు ఆమె శరీరం పై భాగం బలంగా ఉందని నిర్ధారించడంతో శీతల్ విలువిద్యలోకి రావాలని నిర్ణయించుకుంది. కత్రలోని శ్రీ మాతా విష్ణో దేవి దేవాలయం బోర్డ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చేరింది. మొదట ఆమెకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌లు నిరాకరించారు. అయితే, 2012 లండన్ పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడలిస్ట్ మాట్ స్టడ్జ్‌మాన్ కాళ్లతో బాణాన్ని సంధించడం చూసి శీతల్‌కు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

దాంతో శీతల్ కాళ్లు, పాదాల సాయంతో విల్లు ఎక్కుపెట్టి భుజం, తల సాయంతో బాణాన్ని గురి చేసి కొట్టడం ప్రాక్టీస్ చేసింది. మొదట ఆమె రోజుకు 50 నుంచి 100 బాణాలను ప్రాక్టీస్ చేసేది. ఆ తర్వాత 300 బాణాలను సంధించేది. 2019‌లో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన యూత్ స్పోర్ట్స్ ఈవెంట్‌లో ఆమె ప్రతిభ చాటింది. ఆ తర్వాత పారా ఓపెన్ నేషనల్స్ పోటీల్లో రజత పతకం గెలుచుకుంది. అలాగే, ఓపెన్ నేషనల్స్ పోటీల్లో సమర్థులైన ఆర్చరీలతో పోటీపడిన ఆమె 4వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత శీతల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఈ ఏడాది వరల్డ్ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో శీతల్ రజత పతకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. వరల్డ్ చాంపియన్‌షిప్ మెడల్ గెలిచిన తొలి ఆర్మ్ లెస్ ఆర్చరీ‌గా రికార్డు సృష్టించింది. తాజాగా ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలతోసహా మూడు పతకాలు గెలిచింది. అంగవైకల్యం శరీరానికే కానీ, ప్రతిభకు కాదు అని నిరూపిస్తూ శీతల్ అంతర్జాతీయ గడ్డపై దేశం గర్వపడేలా అద్భుతాలు సృష్టిస్తున్నది.



Next Story