నా డీప్‌ఫేక్ ఫొటోలు వైరల్ అయ్యాయి.. సారా టెండూల్కర్ ఆవేదన

by Vinod kumar |   ( Updated:2023-11-22 17:19:49.0  )
నా డీప్‌ఫేక్ ఫొటోలు వైరల్ అయ్యాయి.. సారా టెండూల్కర్ ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్: సారా టెండూల్కర్.. ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. టీమిండియా దిగ్గజ ఆట‌గాడు స‌చిన్ టెండూల్కర్ గారాల ప‌ట్టి. భార‌త జ‌ట్టు ఆడే మ్యాచ్‌లకు హాజ‌రు అవుతూ టీమ్‌ను ఉత్సాహ‌ప‌రుస్తోంది. గ‌త కొంత‌కాలంగా ఆమె టీమిండియా యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్‌తో ప్రేమ‌లో ఉందంటూ వార్తలు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలో ఆమె పేరిట ఉన్న ఖాతాల్లో గిల్ పై ప్రేమ ఉన్నట్లు ప‌లు ఫోటోలు, వ్యాఖ్యలు ఉంటున్నాయి. అయితే.. దీనిపై సారా టెండూల్కర్ స్పందించింది. త‌న పేరుతో కొంద‌రు న‌కిలీ ఖాతాల‌ను తెరిచారని వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన‌కు ఎక్స్‌లో ఎటువంటి ఖాతా లేద‌ని స్పష్టం చేసింది. డీప్ ఫేక్ టెక్నాల‌జీతో కొంద‌రు కావాల‌ని త‌న ప‌రువుకు భంగం క‌లిగించేలా చేస్తున్నార‌ని ఆవేదన వ్యక్తం చేసింది.

‘మ‌న బాధ‌లు, ఆనందాలు, రోజు చేసే ప‌నులు పంచుకునేందుకు సోష‌ల్ మీడియా అనేది ఓ అద్భుత‌మైన సాధ‌నం. ఏదీ ఏమైన‌ప్పటికీ కొంద‌రు టెక్నాల‌జీని దుర్వినియోగం చేస్తున్నారు. నా డీప్ ఫేక్ ఫోటోలు వైర‌ల్ కావ‌డం నేను చూశాను. ఎక్స్‌లో కొంద‌రు నా పేరిట న‌కిలీ ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. నిజానికి నాకు ఎక్స్‌లో ఎటువంటి ఖాతా లేదు. న‌కిలీ ఖాతాల‌ను గుర్తించి స‌స్పెండ్ చేయాల‌ని కోరుకుంటున్నా. నిజాన్ని దాచి అబద్దాలు ప్రచారం చేయ‌డం ద్వారా వినోదం అందించాల్సిన ప‌ని లేదు. న‌మ్మకం, వాస్తవాల ఆధారంగా న‌డిచే క‌మ్యూనికేష‌న్‌ను ఎంక‌రేజ్ చేద్దాం.’ అని సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

Advertisement

Next Story