సాత్విక్ జోడీ శుభారంభం.. థాయిలాండ్‌ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌కు అర్హత

by Harish |
సాత్విక్ జోడీ శుభారంభం.. థాయిలాండ్‌ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌కు అర్హత
X

దిశ, స్పోర్ట్స్ : థాయిలాండ్‌లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ ఆటగాళ్లు తెలుగు కుర్రాడు సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ జోడీ టాప్ సీడ్‌గా బరిలోకి దిగింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో సాత్విక్ జంట 21-13, 21-13 తేడాతో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయుబ్- టాన్ వీ కియోంగ్‌ జోడీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జోడీ కేవలం 34 నిమిషాల్లోనే ప్రత్యర్థి జంటను చిత్తు చేసి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. నేడు రెండో రౌండ్‌లో క్సీ హావో నాన్-జెంగ్ వీ హాన్(చైనా) జోడీతో తలపడనుంది.

పురుషుల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌కు షాక్ తగిలింది. మరో భారత ఆటగాడు మీరాబా లుయాంగ్ మైస్నం చేతిలో 21-19, 21-18 తేడాతో ఓడి తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. ప్రణయ్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మహిళల సింగిల్స్‌లో అష్మిత చాలిహా కూడా శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో 19-21, 21-15, 21-14 తేడాతో ఎస్టర్ నురిమి ట్రై వార్డోయోపై పోరాడి గెలిచింది. అయితే, రెండో రౌండ్‌లో అష్మితకు గట్టి సవాల్ ఎదురైంది. అక్కడ టాప్ సీడ్ హాన్ యూ(చైనా)ను ఎదుర్కోనుంది. మరోవైపు, పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్, సతీశ్ కుమార్ కరుణాకరణ్, మహిళల సింగిల్స్‌లో మాళవిక బాన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌లో ఓటమిపాలయ్యారు.

Advertisement

Next Story