తిరుగులేని సాత్విక్, చిరాగ్.. మలేషియా ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జంట

by Harish |
తిరుగులేని సాత్విక్, చిరాగ్.. మలేషియా ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జంట
X

దిశ, స్పోర్ట్స్ : మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీకి తిరుగులేకుండా పోయింది. టోర్నీలో అదరగొడుతున్న ఈ ద్వయం సీజన్ తొలి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సెమీస్‌లో ఏకంగా వరల్డ్ చాంపియన్‌ జంటకే షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్‌లో సాత్విక్ జోడీ 21-18, 22-20 తేడాతో వరల్డ్ చాంపియన్, సౌత్ కొరియాకు చెందిన కాంగ్ మిన్ వ్యూక్-సియో సీయుంగ్ జే‌‌ జోడీని మట్టికరిపించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ పోరాడి గెలిచింది. తొలి గేమ్‌ ప్రారంభంలో దూకుడు ఆటతీరుతో 5-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. కొరియా జోడీ పుంజుకుని పోటీనిచ్చేందుకు చూసింది. అయితే, భారత జంట తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ తొలి గేమ్‌ను గెలుచుకుంది. ఇక, రెండో గేమ్‌లో కొరియా షట్లర్లు బలంగా పుంజుకున్నారు. గేమ్ ప్రారంభంలో దూకుడు ఆటతీరుతో వారు ఇంటర్వెల్ సమయానికి 11-6తో ఆధిక్యంలో నిలిచారు. భారత జోడీ పలు తప్పిదాలతో వెనుకబడింది. 14-20తో గేమ్‌ను కోల్పోయే స్థితిలో నిలిచింది. ఈ పరిస్థితుల్లో సాత్విక్, చిరాగ్ జోడీ పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా 8 పాయింట్లు సాధించి కొరియా జోడీ నుంచి గేమ్‌ను లాక్కుని విజేతగా నిలిచింది. దీంతో మలేషియా ఓపెన్‌ టోర్నీ చరిత్రలో ఏ విభాగంలోనైనా ఫైనల్‌కు చేరిన తొలి భారత షట్లర్లుగా సాత్విక్, చిరాగ్ రికార్డు సృష్టించారు.

Advertisement

Next Story