- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రోహిత్, షమీ మధ్య గొడవ?.. గాయమే చిచ్చురేపిందా?

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ మహ్మద్ షమీ మధ్య గొడవ జరిగిందా?.. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ ఇదే. గాయం నుంచి కోలుకున్న షమీ దేశవాళీలో ఆడుతున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జాతీయ జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు, షమీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని రోహిత్ చెబుతున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్, షమీ మధ్య సంబంధాలు అంతగా బాగా లేవని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. ఇద్దరు గొడవపడినట్టు జాతీయ మీడియా కోడై కూస్తోంది. ‘షమీ ఎన్‌సీఏలో ఉన్నప్పుడు రోహిత్‌ను కలిశాడు. గాయం పరిస్థితి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు. అనంతరం మీడియాతో షమీ ఫిట్‌గా లేడని, మోకాలిలో వాపు ఉందని రోహిత్ మీడియాతో చెప్పాడు. రోహిత్ వ్యాఖ్యలపై షమీ అసంతృప్తిగా ఉన్నాడు. బెంగళూరు టెస్టు తర్వాత మరోసారి షమీని రోహిత్ కలిశాడు. అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.’ అని సంబంధిత వర్గాలు తెలిపినట్టు ఓ జాతీయ మీడియా తెలిపింది.
గాయమంటున్న రోహిత్.. సత్తాచాటుతున్న షమీ
న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్టు అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. షమీ మోకాలిలో వాపు వచ్చిందని చెప్పాడు. దీంతో షమీ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు షమీ పుకార్లు నమ్మొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. రెండో టెస్టు ముగిసిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ మళ్లీ అదే కారణం చెప్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడే సమయంలో షమీ మోకాలిలో వాపు కనిపించిందని, టెస్టు మ్యాచ్ ఆడేందుకు అతను సిద్ధం లేడని తెలిపాడు. అతన్ని తొందరపడి ఆస్ట్రేలియాకు తీసుకరావాలని అనుకోవడం లేదన్నాడు మరోవైపు, దేశవాళీలో షమీ సత్తాచాటుతున్నాడు. గత నెలలో మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో బెంగాల్‌కు ఆడిన అతను 7 వికెట్లు తీశాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ బెంగాల్‌కు ఆడుతున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు. రోహిత్ వ్యాఖ్యలకు, షమీ ప్రదర్శనకు సంబంధం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే..
దేశవాళీలో రాణిస్తున్నప్పటికీ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తాడా?లేదా? అంటే కచ్చితమైన చెప్పలేని పరిస్థితి. అతనికి ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదని, ఆసిస్‌కు ఎప్పుడు పంపాలనే దానిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన స్పోర్ట్స్ సైన్స్ వింగ్ షమీ ఫిట్‌నెస్ రిపోర్ట్ అందజేయాల్సి ఉంది. జాతీయ సెలెక్టర్ ఎస్‌ఎస్ దాస్, బీసీసీఐ స్పోర్ట్స్ వింగ్ హెడ్ నితిన్ పటేల్, స్ట్రెంత్ అండ్ కండషనింగ్ ట్రైనర్ షమీని పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాకపోవడంతో మూడో టెస్టుకు అతను అందుబాటులో ఉండడు. ఆ తర్వాతి రెండు టెస్టులకు షమీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఎన్‌సీఏ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే.