ధోనీ, కోహ్లీ, రోహిత్ గ్రేట్ కెప్టెన్లే.. కానీ, నా ఫేవరెట్ కెప్టెన్ మాత్రం అతడే : బుమ్రా

by Harish |
ధోనీ, కోహ్లీ, రోహిత్ గ్రేట్ కెప్టెన్లే.. కానీ, నా ఫేవరెట్ కెప్టెన్ మాత్రం అతడే : బుమ్రా
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్లు ఎం.ఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సారథులు అని భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా తెలిపాడు. అయితే, తన ఫేవరెట్ కెప్టెన్ మాత్రం తానేనని వ్యాఖ్యానించాడు. ధోనీ నాయకత్వంలో అరంగేట్రం చేసిన బుమ్రా.. కోహ్లీ, రోహిత్ సారథ్యంలో స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా పలు విషయాలు తెలిపాడు. ఈ సందర్భంగా ధోనీ, కోహ్లీ, రోహిత్ నాయకత్వ లక్షణాల గురించి వివరించాడు.

ముందుగా రోహిత్‌ గురించి చెబుతూ.. ‘రోహిత్ బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ బౌలర్లపై సానుభూతి చూపే అతికొద్ది మంది కెప్టెన్లలో రోహిత్ ఉంటాడు. ఆటగాళ్ల భావోద్వేగాలను అర్థం చేసుకుంటాడు. రోహిత్ కఠినంగా ఉండడు. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాడు.’ అని తెలిపాడు. అలాగే, ధోనీ గురించి మాట్లాడుతూ..‘ధోనీ నాకు భద్రత ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో నేను నిలదొక్కుకోవడానికి అది సహాయపడింది.’ అని చెప్పాడు. ఇక, కోహ్లీ గురించి చెబుతూ.. విరాట్ చాలా ఎనర్జీగా ఉంటాడని, క్రికెట్‌పై అతని నిబద్ధత అద్భుతమని తెలిపాడు. ‘విరాట్ ఇప్పుడు కెప్టెన్ కాకపోవచ్చు. కానీ, అతను ఎప్పటికీ నాయకుడే, కెప్టెన్సీ అనేది ఒక పోస్టు మాత్రమే.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, వచ్చే నెలలో జరగబోతున్న దులీప్ ట్రోఫీకి రోహిత్, కోహ్లీతోపాటు బుమ్రాకు విశ్రాంతనిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story