వైస్ కెప్టెన్‌గా బుమ్రా.. స్టార్‌ పేసర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన రోహిత్

by Harish |
వైస్ కెప్టెన్‌గా బుమ్రా.. స్టార్‌ పేసర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన రోహిత్
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం వచ్చే నెలలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో పేసర్ మహమ్మద్ షమీ పాల్గొనడం కష్టమేనని కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. నేటి నుంచి న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరులో మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ పలు విషయాలు వెల్లడించాడు. షమీ ఫిట్‌నెస్‌పై స్పందిస్తూ.. ‘షమీ 100 శాతం ఫిట్‌గా ఉండేందుకు దగ్గరలో ఉన్నాడు. కానీ, అతనికి ఓ సమస్య ఉంది. అతడి మోకాలిలో వాపు ఉంది. దీంతో అతను మళ్లీ మొదలుపెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎన్‌సీఏలో వైద్యులు, ఫిజియోల పర్యవేక్షణలో ఉన్నాడు. పూర్తిగా కోలుకోకుండా అతన్ని ఆసిస్ పర్యటనకు తీసుకెళ్లడం సరైన నిర్ణయం కాదు. కోలుకోవడానికి అతనికి కావాల్సిన సమయం ఇవ్వాలనుకుంటున్నాం. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత షమీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాడు’ అని చెప్పాడు.

జైశ్వాల్‌పై ప్రశంసలు

యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌పై రోహిత్ ప్రశంసలు కురిపించాడు. అతను ఏ పరిస్థితుల్లోనైనా ఆడగలడని, నిజమైన ప్రతిభావంతుడని ప్రశంసించాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌కు జైశ్వాల్ కొత్త. కాబట్టి, అతని గురించి ఇప్పుడే ఏం చెప్పలేం. కానీ, అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడానికి కావాల్సిన అర్హతలు అతనికి ఉన్నాయి. జైశ్వాల్ ఆటను, బ్యాట్‌మన్‌షిప్ గురించి నేర్చుకోవాలనుకునే వ్యక్తి. రోజురోజుకూ మెరుగవుతున్నాడు. ఇప్పటివరకు సాధించిన దానితో అతను సంతోషంగా లేడు. ఓ యువ క్రికెటర్‌కు ఇది గొప్ప ఆరంభం. మాకు గొప్ప ఆటగాడు దొరికాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్, దూకుడుగా ఆడే అతని శైలి మా జట్టుకు ఉపయోగపడుతుంది.’ అని తెలిపాడు.

లీడర్‌షిప్ గ్రూపులో బుమ్రా ఉంటాడు

భారత జట్టులో లీడర్‌షిప్ గ్రూపులో బుమ్రా కచ్చితంగా ఉంటాడని రోహిత్ వ్యాఖ్యానించాడు. బుమ్రాకు వైస్‌ కెప్టెన్సీ ఇవ్వడంపై రోహిత్ స్పందిస్తూ.. ‘బుమ్రా చాలా క్రికెట్ ఆడాడు. ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. వ్యూహరచన కూడా బాగుంటుంది. కానీ, అతను ఎక్కువ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా లేడు. నాకు తెలిసి ఒక్క టెస్టు, రెండు టీ20లకు మాత్రమే సారథిగా ఉన్నాడు. అయితే, నాయకుడు అవసరమైన పరిస్థితుల్లో మాత్రం అతను ముందుంటాడని చెప్పగలను.’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story