IND VS SL : వెకేషన్ ముగిసింది.. శ్రీలంకలో అడుగుపెట్టిన రోహిత్, కోహ్లీ

by Harish |
IND VS SL : వెకేషన్ ముగిసింది.. శ్రీలంకలో అడుగుపెట్టిన రోహిత్, కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శ్రీలంకతో వన్డే సిరీస్‌పై ఫోకస్ పెట్టనున్నారు. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత రోహిత్ ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెళ్లగా.. విరాట్-అనుష్క దంపతులు లండన్‌కు వెళ్లారు. శ్రీలంకతో వన్డే సిరీస్ నేపథ్యంలో తమ వెకేషన్‌ను ముగించుకున్నారు. వారిద్దరు ఆదివారం రాత్రి శ్రీలంకకు చేరుకున్నారు. అయితే, మొదట శ్రీలంక టూరుకు వారు విశ్రాంతి కోరినట్టు వార్తలు వచ్చాయి. కానీ, హెడ్ కోచ్ గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్ మేరకు వారు ఈ పర్యటనకు అంగీకరించినట్టు తెలుస్తోంది. రోహిత్, కోహ్లీలతోపాటు శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, హర్సిత్ రాణా కొలంబోకు చేరుకున్నారు.

కొలంబో స్టేడియంలో వన్డే జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు. ఆ ప్రాక్టీస్ సెషన్‌ను అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షించనున్నాడు. శ్రీలంకతో రెండో టీ20 అనంతరం అభిషేక్ పల్లెకెల్ నుంచి సోమవారం కొలంబోకు చేరుకున్నట్టు తెలుస్తోంది. వన్డే సిరీస్‌లో భాగంగా ఆగస్టు 2న తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే సూర్య నేతృత్వంలో టీ20 జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లను నెగ్గి టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. నేడు మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం వన్డే జట్టులో ఉన్న మిగతా సభ్యులు కూడా కొలంబోకు వెళ్లనున్నారు.

Advertisement

Next Story