- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సన్‌రైజర్స్ అంటే ఫైర్ అనుకుంటిరా.. వైల్డ్ ఫైరు

- తగ్గేదేలేదంటూ చెలరేగిన బ్యాటర్స్
- తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన కిషన్
- రాణించిన హెడ్, నితీశ్ రెడ్డి, క్లాసెన్
- రాజస్థాన్ టార్గెట్ 287
దిశ, స్పోర్ట్స్: సన్ రైజర్స్ ఈ సీజన్‌లో 300 కొడతారని ఐపీఎల్ స్టార్ట్ కాక ముందు నుంచే అభిమానులు అంచనాలు వేసుకున్నారు. గత సీజన్‌లో చెలరేగిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్‌లకు ఈ సారి ఇషాన్ కిషన్ కూడా తోడవడంతో ఈ సారి ట్రిపుల్ సెంచరీ ఖాయమని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే సన్‌రైజర్స్ తరపున అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 47 బంతుల్లో ఏకంగా 106 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ (67), క్లాసెన్ (34), నితీశ్ రెడ్డి (30) కూడా రాణించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 286 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇది ఐపీఎల్‌లో రెండో అత్యధిక టీమ్ స్కోర్ కావడం గమనార్హం.
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్డేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు జట్టుకు శుభారంభాన్ని అందించారు. రాజస్థాన్ బౌలర్లను మొదటి నుంచి చితకబాదారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు మూడు ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఐదు బౌండరీలు బాది మంచి ఊపు మీద ఉన్న అభిషేక్ శర్మ(24)ను మహీశ్ తీక్షణ అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎప్పటిలాగే తన దూకుడైన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోర్‌ను పరుగులు పెట్టించారు. ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. అయితే దూకుడుగా ఉన్న హెడ్‌ను తుషార్ దేశ్‌పాండే అవుట్ చేశాడు.ఆ తర్వాత వచ్చిన నితీశ్ రెడ్డి (30), క్లాసెన్ (34) కూడా చెలరేగి ఆడారు. ఆఖర్లో భారీ షాట్ల కోసం ప్రయత్నించి అనికెత్ వర్మ (7), అభినవ్ మనోహర్ (0) అవుటయ్యారు. అయితే మరో ఎండ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ మాత్రం తన దూకుడు తగ్గించలేదు. ఈ క్రమంలో కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్పులు, 11 ఫోర్లు ఉండటం గమనార్హం. ఇన్నింగ్స్ చివరి వరకు కిషన్ నిలబడటంతో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 286 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తుషార్ దేశ్‌పాండే 3, మహీష తీక్షణ 2 వికెట్లు తీయగా సందీప్ శర్మకు ఒక వికెట్ లభించింది.
స్కోర్ బోర్డు :
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ (సి) యశస్వి జైస్వాల్ (బి) మహీష తీక్షణ 24, ట్రావిస్ హెడ్ (సి) హెట్‌మెయర్ (బి) తుషార్ దేశ్‌పాండే 67, ఇషాన్ కిషన్ 106 నాటౌట్, నితీశ్ కుమార్ రెడ్డి (సి) యశస్వి జైస్వాల్ (బి) మహీష తీక్షణ 30, క్లాసెన్ (సి) రియాన్ పరాగ్ (బి) సందీప్ శర్మ 34, అనికెత్ వర్మ (సి) జోఫ్రా ఆర్చర్ (బి) తుషార్ దేశ్‌పాండే 7, అభినవ్ మనోహర్ (సి) రియాన్ పరాగ్ (బి) తుషార్ దేశ్‌పాండే 0, కమ్మిన్స్ 0 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 18; మొత్తం 286/6 (20 ఓవర్లు)
వికెట్ల పతనం : 45-1, 130-2, 202-3, 258-4, 279-5, 279-6
బౌలింగ్ : ఫజల్లాఖ్ ఫారూఖీ (3-0-49-0), మహీష తీక్షణ (4-0-52-2), జోఫ్రా ఆర్చర్ (4-0-76-0), సందీప్ శర్మ (4-0-51-1), నితీష్ రాణా (1-0-9-0), తుషార్ దేశ్‌పాండే (4-0-44-3)