బోయిన్ పల్లిలో భారీ చోరీ..

by Sridhar Babu |
బోయిన్ పల్లిలో భారీ చోరీ..
X

దిశ, తిరుమలగిరి : నెల క్రితం తన తల్లి మృతి చెందడంతో స్వగ్రామానికి వెళ్లిన అంజిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన ఆదివారం బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బోయిన్ పల్లిలోని సంచారపురి కాలనీలో నివాసం ఉంటున్న అంజిరెడ్డి ఇంట్లో తాళాలు పగలగొట్టిన దుండగుడు బీరువాలో ఉన్న 24 తులాల బంగారంతో పాటు, కిలో వెండి ఆభరణాలు, 12 వేల నగదు అపహరించుకొని పరారయ్యాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 17న మెదక్ లోని చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లినట్లు ఇంటి యజమాని అంజిరెడ్డి తెలిపారు.

ఆదివారం ఉదయం ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి తనకు సమాచారం అందించారని పేర్కొన్నారు. ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలతో పాటు నగదు అపహరణకు గురైందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయిన్ పల్లి పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అదే విధంగా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. గుర్తు తెలియని దుండగుడు అర్ధరాత్రి వేళ ఇంట్లోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాలలో దృశ్యాలు నమోదు అయ్యాయి. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరాడు.

Next Story