చెలరేగిన సౌరాష్ట్ర బౌలర్లు.. బెంగాల్ జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌట్

by Vinod kumar |   ( Updated:2023-02-16 14:58:32.0  )
చెలరేగిన సౌరాష్ట్ర బౌలర్లు.. బెంగాల్ జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌట్
X

కోల్‌కతా: రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి రోజు సౌరాష్ట్రదే. ఆ జట్టు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. గురువారం ప్రారంభమైన రంజీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడిన బెంగాల్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ప్రారంభం నుంచే సౌరాష్ట్ర బౌలర్లు ఉనద్కత్, చేతన్ సకారియా, చిరాగ్ జానీ, జడేజా ప్రత్యర్థి జట్టును వరుస వికెట్లతో కష్టాల్లోకి నెట్టారు. దాంతో బెంగాల్ తొలి రెండు ఓవర్లలోనే 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా బెంగాల్ బ్యాటింగ్ గాడినపడకపోవడంతో 65 పరుగులకు 6 వికెట్లు నష్టపోయి తీవ్ర కష్టాల్లో పడింది.

కెప్టెన్ మనోజ్ తివారి(7)తో సహా టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ సమయంలో షాబాజ్ అహ్మద్(69), అభిషేక్ పొరెల్(50) కీలక ఇన్నింగ్స్‌ ఆడి 7వ వికెట్‌కు 101 పరుగులు జోడించారు. ఈ జోడీ జట్టులో ఆశలు రేపినా.. షాబాజ్ అహ్మద్ అవుటైన కాసేపటికే బెంగాల్ మిగతా మూడు వికెట్లను కూడా స్వల్ప వ్యవధిలోనే కోల్పోయింది. ఉన్కదత్ బౌలింగ్‌లో ముఖేశ్ కుమార్(1) అవుట్ కావడంతో బెంగాల్ 174 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కత్, చేతన్ సకారియా చెరో 3 వికెట్లు తీయగా.. చిరాగ్ జానీ, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు.

తొలి రోజే ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 81/2 స్కోరు చేసింది. ఓపెనర్ జై గోహిల్(6) నిరాశపర్చగా.. విశ్వరాజ్ జడేజా(25) క్రీజులో కుదురుకునే క్రమంలో ముఖేశ్ కుమార్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. ఓపెనర్ హర్విక్ దేశాయ్(38), చేతన్ సకారియా(2) ఆచితూచి ఆడుతూ తొలి రోజు ఆట ముగించారు. సౌరాష్ట్ర ఇంకా 93 పరుగులు వెనుకబడి ఉన్నది. రెండో రోజు సౌరాష్ట్ర బ్యాటర్లు నిలబడి భారీ స్కోరు చేస్తే బెంగాల్ కష్టాల్లో పడినట్టే.

Also Read...

డబ్ల్యూటీసీ టైటిల్ నెగ్గడమే లక్ష్యం : టీమిండియా సీనియర్ బ్యాటర్

Advertisement

Next Story