రాహుల్ 214.. తిలక్ 100.. హైదరాబాద్ 474/5 డిక్లేర్డ్

by Swamyn |
రాహుల్ 214.. తిలక్ 100.. హైదరాబాద్ 474/5 డిక్లేర్డ్
X

దిశ, స్పోర్ట్స్ : రాహుల్ సింగ్(214) డబుల్ సెంచరీకి తోడు కెప్టెన్ తిలక్ వర్మ(100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో రంజీ ట్రోఫీలో నాగాలాండ్‌పై హైదరాబాద్ జట్టు తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ శుక్రవారం ప్రారంభమైంది.ఈ టోర్నీలో ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్‌లో నాగాలాండ్‌తో ఆడుతుంది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 474/5 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. ఓపెనర్ రోహిత్ రాయుడు(2) నిరాశపర్చినా.. రాహుల్ సింగ్ డబుల్ సెంచరీతో విజృంభించాడు. 157 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్‌లతో 214 పరుగులు చేశాడు. భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాజీ దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి తర్వాత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. మరో ఎండ్‌లో రాణించిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(80) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 227 పరుగులు జోడించడంతో హైదరాబాద్ భారీ స్కోరుకు అడుగులు పడ్డాయి. ఆ తర్వాత భారత యువ క్రికెటర్, కెప్టెన్ తిలక్ వర్మ(100 నాటౌట్, 112 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) సైతం అజేయ శతకంతో మెరిశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తిలక్‌కు ఇది రెండో సెంచరీ. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన అతను రాహుల్ సింగ్‌తో కలిసి మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించాడు. రాహుల్ అవుటైన తర్వాత కూడా చందన్ సహాని(23), ప్రగ్నయ్ రెడ్డి(19), రవితేజ(21 నాటౌట్) సహకారంతో తిలక్ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. ఈ క్రమంలో 474/5 స్కోరు వద్ద హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చింది. తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన నాగాలాండ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. నాగాలాండ్ జట్టు ఇంకా 439 పరుగులు వెనకబడి ఉన్నది.

Advertisement

Next Story