Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 11వ సీజన్ షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌లు ఎప్పటినుంచి ప్రారంభమంటే..?

by Maddikunta Saikiran |
Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 11వ సీజన్ షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌లు ఎప్పటినుంచి ప్రారంభమంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 11వ సీజన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. అక్టోబర్ 18వ తేదీ నుంచి PKL ప్రారంభంకానుంది. ఈసారి మూడు వేదికల్లో మ్యాచులు నిర్వహించనున్నారు. కాగా గత సీజన్ మ్యాచులను 12 వేర్వేరు నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం కేవలం మూడు నగరాల్లోనే ఈ మెగా టోర్నీ జరగనుంది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ మ్యాచ్‌లు హైదరాబాద్, నోయిడా, పుణె వేదికగా జరగనున్నాయి.మొదటి అంచె పోటీలు అక్టోబర్ 18వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభంకానున్నాయి. ఆ తరువాత నవంబర్ 10 నుంచి నోయిడాలో,డిసెంబర్ 3 నుంచి పూణెలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అయితే ప్లేఆఫ్ తేదీలు, వేదికను నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు.

సీజన్ 11 షెడ్యూల్‌ సందర్భంగా ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. పీకేఎల్ 10 సీజన్లు విజయవంతంగా జరిగాయని.. సీజన్ 11 సరికొత్తగా ప్రారంభంకానుందన్నారు. అయితే ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి.గత సీజన్ లో పూణేరి పల్టన్ విజేతగా నిలిచింది.సీజన్ 10 ఫైనల్ పోరులో పూణేరి పల్టన్, హర్యానా స్టీలర్స్‌ను 28-25తో ఓడించింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ స్టార్ స్పోర్ట్స్(Star Sports) నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్(Disney+Hotstar) యాప్‌లో కూడా మ్యాచ్‌లను వీక్షించవచ్చు. కాగా పీకేఎల్ సీజన్ 11 కు సంబంధించిన వేలం ఆగస్టు 15, 16వ తేదీల్లో ముంబైలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed