అభినందస్తూ.. అనుభవాలను తెలుసుకుంటూ.. పారా అథ్లెట్లతో ప్రధాని మోడీ

by Harish |
అభినందస్తూ.. అనుభవాలను తెలుసుకుంటూ.. పారా అథ్లెట్లతో ప్రధాని మోడీ
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పతక పంట పండించిన మన పారా వీరులను ప్రధాని మోడీ గురువారం కలిశారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పతక విజేతలకు మోడీ అభినందనలు తెలిపారు. వారి విజయాలను ప్రశంసించారు. దాదాపు గంట సేపు వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పారాలింపిక్స్ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు అథ్లెట్లు తమ అనుభవాలను వివరించారు.

అనంతరం ప్రధాని మోడీ.. అథ్లెట్లతో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా షూటర్ అవనీ లేఖరా జెర్సీని ప్రధానికి అందజేసింది. అలాగే, జూడోకా కపిల్ పర్మార్ పతకంపై మోడీ సంతకం చేశాడు. జావెలిన్ త్రోయర్ నవ్‌దీప్ తన క్యాప్‌ను ప్రధానికి అందజేశారు. స్వర్ణం సాధించిన ఆర్చర్ హర్విందర్ సింగ్ తన బాణాన్ని మోడీకి ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను క్రీడా మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఆ వీడియో వైరల్‌గా మారింది. ప్రధానిని కలిసిన అథ్లెట్లలో తెలంగాణ అమ్మాయి, స్ప్రింటర్ జీవాంజి దీప్తి కూడా ఉంది. పారాలింపిక్స్‌లో 400 మీటర్ల టీ20 కేటగిరీలో ఆమె కాంస్యం సాధించిన విషయం తెలిసిందే.

ఆ సమావేశంలో పారా అథ్లెట్లతోపాటు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దేవేంద్ర జజారియా పాల్గొన్నారు. పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు ఏకంగా 29 పతకాలు సొంతం చేసుకున్నారు. అందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. టోక్యో పారాలింపిక్స్‌లో సాధించిన 19 పతకాల ప్రదర్శనను పారిస్‌లో అధిగమించారు.

Advertisement

Next Story

Most Viewed