Paris Olympics : ఒలింపిక్స్‌లో భారత్ రెండో రోజు ఇలా.. ఓ లుక్కేయండి

by Harish |
Paris Olympics : ఒలింపిక్స్‌లో భారత్ రెండో రోజు ఇలా.. ఓ లుక్కేయండి
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టింది. షూటర్ మను బాకర్ ఆదివారం పతక వేటకు శ్రీకారం చుట్టింది. కాంస్యం నెగ్గి ఈ విశ్వక్రీడల్లో దేశానికి తొలి మెడల్ అందించింది. షూటింగ్‌లో 12 ఏళ్ల మెడల్ నిరీక్షణకు తెరదించడంతోపాటు ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గానూ చరిత్ర సృష్టించింది. షూటింగ్‌లో మరో రెండు పతకాలు అందించడానికి రమిత, అర్జున్ సిద్ధంగా ఉన్నారు.

పారిస్ విశ్వక్రీడల్లో స్టార్ షూటర్ మను బాకర్ అంచనాలను నిలబెట్టుకుంటూ కాంస్యం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో ఆమె పతకం గెలిచింది. శనివారం క్వాలిఫికేషన్ రౌండ్‌లో మనిక 580 స్కోరుతో 3వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మెడల్ రౌండ్‌లోనూ ఆమె సత్తాచాటింది. 221.7 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించింది. అయితే ఆమె ఓ దశలో రజతం దక్కించుకునేలా కనిపించింది. మూడో సిరీస్ ముగిసే సరికి మను 121.2 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సౌత్ కొరియా షూటర్లు ఓహ్ యి జిన్, కిమ్ యెజీ పుంజుకున్నారు. అయినప్పటికీ మను ఏమాత్రం పట్టుదల వదలకుండా చివరి మూడు సిరీస్‌లో అన్ని షాట్లను 10కిపైగా స్కోరు చేసింది. 8వ సిరీస్‌లు పూర్తయ్యేసరికి మను(221.7 స్కోరు) 0.1 పాయింట్‌తో రజతం చేజార్చుకుంది. కిమ్ యెజి 221.8 స్కోరుతో ముందుకు వెళ్లింది. ఓహ్ యి జిన్(243.2) స్వర్ణం, కిమ్ యెజీ(241.3) రజతం సాధించారు.

ఫైనల్‌కు రమిత, అర్జున్

షూటింగ్‌లో మరో రెండు పతకాలు దక్కే అవకాశం ఉంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రమిత, అర్జున్ ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల క్వాలిఫికేషన్ రౌండ్‌లో రమిత సత్తాచాటింది. 631.5 స్కోరుతో 5వ స్థానంలో నిలిచి మెడల్ రౌండ్‌కు చేరుకుంది. మరో షూటర్ ఇలవెనిల్ వలరివన్(630.7 స్కోరు) 10వ స్థానంలో నిలిచి పతక పోటీకి దూరమైంది. టాప్-8 షూటర్లు మాత్రమే ఫైనల్‌కు చేరుకుంటారు. పురుషుల క్వాలిఫికేషన్ రౌండ్‌లో అదరగొట్టిన అర్జున్ బబుతా 630.1 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. మరో భారత షూటర్ సందీప్‌ సింగ్ (629.3 స్కోరు) 12వ స్థానంతో సరిపెట్టాడు. నేడు మహిళలు, పురుషుల ఈవెంట్లలో ఫైనల్ జరగనుంది.

ప్రీక్వార్టర్స్‌కు నిఖత్

బాక్సింగ్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. మహిళల 50 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన ఆమె తొలి రౌండ్‌లో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మొదటి బౌట్‌లో ఆమె 5-0 తేడాతో జర్మనీకి చెందిన మాక్సీ కరీనా క్లోట్జర్‌ను చిత్తు చేసింది. మొదట్లో ప్రత్యర్థి తన ఎత్తును ఉపయోగించకుని నిఖత్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో తొలి రౌండ్‌లో వెనుకబడిన నిఖత్ ఆ తర్వాత బలంగా పుంజుకుంది. జర్మనీ బాక్సర్‌పై పంచ్‌ల వర్షం కురిపించింది. మిగతా రౌండ్లలో నెగ్గడంతోపాటు ఐదుగురు జడ్జీల మద్దతు పొందింది. అయితే, ప్రీక్వార్టర్స్‌లో నిఖత్‌కు కఠిన ప్రత్యర్థి ఎదురైంది. వరల్డ్ చాంపియన్, చైనా బాక్సర్ వు యుతో తలపడనుంది.

సింధు శుభారంభం

హ్యాట్రిక్ మెడల్‌పై కన్నేసిన తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు ఆ దిశగా తొలి అడుగు వేసింది. మహిళల సింగిల్స్‌లో తొలి గ్రూపు మ్యాచ్‌లో సింధు 21-9, 21-6 తేడాతో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ అబ్దుల్ రజాక్‌పై ఏకపక్ష విజయం సాధించింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు కేవలం 29 నిమిషాల్లోనే రెండు గేమ్‌లను గెలిచింది. ఈ నెల 31న రెండో మ్యాచ్‌లో ఎస్టోనియా క్రిస్టిన్ కూబ‌తో సింధు తలపడనుంది. గ్రూపు దశలో సులువైన డ్రా దక్కడంతో సింధు నాకౌట్ రౌండ్‌కు చేరుకోవడం దాదాపు ఖాయమే.

క్వార్టర్స్‌కు రోయర్ బాల్‌రాజ్ పన్వార్

రోయింగ్‌లో భారత రోయర్ బాల్‌రాజ్ పన్వార్ పురుషుల సింగిల్స్ స్కల్స్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. రీపేజ్ రౌండ్‌ ద్వారా ముందడుగు వేశాడు. శనివారం జరిగిన హీట్స్ దశలో అతను 4వ స్థానంలో నిలిచి తృటిలో క్వార్టర్స్‌కు చేరుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే, రీపేజ్ రౌండ్‌లో సత్తాచాటిన బాల్‌రాజ్ రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. అతను 7:12.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు.

స్విమ్మింగ్‌లో ముగిసిన పోరాటం

స్విమ్మింగ్‌లో భారత్ ప్రయాణం రెండో రోజే ముగిసింది. ఈ ఈవెంట్‌లో శ్రీహరి నటరాజ్, ధీనిది దేశింగు పాల్గొనగా వారు సెమీస్‌కు అర్హత సాధించలేకపోయారు. పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో శ్రీహరి తన హీట్‌లో 55.01 సెకన్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు. అయితే, మొత్తంగా అతను 33వ స్థానంతో సరిపెట్టాడు. టాప్-16 స్విమ్మర్లు మాత్రమే సెమీస్‌కు చేరుకుంటారు. మహిళల 200 మీటర్ల ప్రీస్టైల్ ఈవెంట్‌లో ధీనిది దేశింగు 2:06.96 సెకన్ల ప్రదర్శనతో తన హీట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. కానీ, మొత్తంగా 23వ స్థానంలో నిలవడంతో ఆమె ముందడుగు వేయలేకపోయింది. శ్రీహరికి ఇవి రెండో విశ్వక్రీడలు కాగా.. ధీనిది పాల్గొనడం ఇదే తొలిసారి.

తొలి రౌండ్‌లోనే శరత్ ఔట్.. శ్రీజ ముందుకు

టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. సీనియర్ ఆటగాడు శరత్ కమల్ అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. స్లోవేనియా ప్లేయర్ డెని కోజుల్ చేతిలో 2-4(12-10, 9-11, 6-11, 7-11, 11-8, 10-12) తేడాతో ఓడిపోయాడు. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, స్టార్ క్రీడాకారిణి మనిక బాత్రా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. తొలి రౌండ్‌లో శ్రీజ 4-0( 11-4, 11-9, 11-7, 11-8) తేడాతో క్రిస్టినా కాల్‌బెర్గ్(స్వీడన్)పై విజయం సాధించింది. మనికా బాత్రా 4-1(11-8, 12-10, 11-9, 9-11, 11-5) తేడాతో అన్నా హర్సీ(గ్రేట్ బ్రిటన్)ను ఓడించింది. ఈ నెల 31న జరిగే రెండో రౌండ్‌లో ప్రితికా పవాడే(ఫ్రాన్స్)తో మనిక, జెంగ్ జియాన్(సింగపూర్)తో శ్రీజ ఆడనున్నారు.

ఆర్చరీలో నిరాశ

పతక ఆశలు ఉన్న క్రీడాంశాల్లో ఆర్చరీ ఒకటి. అయితే, ఆ విభాగంలో మహిళల రికర్వ్ జట్టు పతక వేటలో నిరాశపర్చింది. దీపిక కుమారి, అంకిత భకత్, భజన్ కౌర్‌లతో కూడిన భారత జట్టు పతకం లేకుండానే ఇంటిదారిపట్టనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 0-6 తేడాతో నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలైంది.

Advertisement

Next Story

Most Viewed