సింధు, ప్రణయ్‌లకు సులువైన డ్రా

by Harish |
సింధు, ప్రణయ్‌లకు సులువైన డ్రా
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్‌లకు సులవైన డ్రా లభించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) శుక్రవారం గ్రూపు దశ డ్రాను రిలీజ్ చేసింది. ఉమెన్స్ సింగిల్స్‌లో గ్రూపు-ఎంలో సింధుకు చోటు దక్కగా ఆమె.. క్రిస్టిన్ కూబా(ఎస్టోనియా), అబ్దుల్ రజాక్(మాల్దీవులు)తో తలపడనుంది. తన కంటే తక్కువ ర్యాంకర్లను ఎదుర్కోనుండటంతో సింధు నాకౌట్‌కు చేరుకోవడం సులభమే. అదే జరిగితే రౌండ్-16లో సింధు చైనాకు చెందిన హీ బింగ్ జియావోతో ఆడే చాన్స్ ఉంది.

మెన్స్ సింగిల్స్‌లో ప్రణయ్‌ కూడా గ్రూపు దశను అలవోకగా దాటే అవకాశాలు ఉన్నాయి. గ్రూపు-కెలో ఉన్న వరల్డ్ నం.13 ప్రణయ్.. 70వ ర్యాంకర్ లే డక్ ఫాట్(వియత్నం), 82వ ర్యాంకర్ ఫాబియన్ రోత్(జర్మనీ)లతో ఆడనున్నాడు. మరోవైపు, మరో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్‌కు కఠిన డ్రా లభించింది. గ్రూపు-ఎల్‌లో వరల్డ్ నం.3 జోనాథన్ క్రిస్టీ(ఇండోనేషియా)తో అతనికి గట్టి పోటీ తప్పదు. అతన్ని దాటితే లక్ష్యసేన్ దాదాపు ముందడుగు వేసినట్టే. ఆ గ్రూపులో ఉన్న కెవిన్ కార్డన్(గ్వాటెమాల), జులియన్ కరాగీ(బెల్జియం)‌లపై లక్ష్యసేన్ గెలవాల్సి ఉంటుంది. గ్రూపులో టాప్ నిలిచిన ప్లేయర్ మాత్రమే నాకౌట్‌కు చేరుకుంటాడు. లక్ష్యసేన్, ప్రణయ్ గ్రూపు దశలో నెగ్గితే.. వీరిద్దరూ రౌండ్-16లో తలపడొచ్చు. ఇది భారత్ పతక అవకాశాలను దెబ్బతీస్తోంది.

మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జంటకు కూడా కఠిన డ్రానే లభించింది. గ్రూపు దశలో ఈ భారత జంట 4వ సీడ్ నమీ మత్సుయమా-చిహారు షిదా(జపాన్‌) జోడీని ఎదుర్కోనుంది. మెన్స్ డబుల్స్ డ్రాను బీడబ్ల్యూఎఫ్ వాయిదా వేసింది. ఆ కేటగిరీలో భారత స్టార్ జోడీ సాత్విక్‌-చిరాగ్ శెట్టి మూడో సీడ్‌గా బరిలోకి దిగనుంది.

Advertisement

Next Story

Most Viewed