Novak Djokovic: యూఎస్ ఓపెన్‌ నుంచి జకోవిచ్‌ ఔట్.. మూడో రౌండ్‌లో షాక్

by Harish |
Novak Djokovic: యూఎస్ ఓపెన్‌ నుంచి జకోవిచ్‌ ఔట్.. మూడో రౌండ్‌లో షాక్
X

దిశ, స్పోర్ట్స్ : 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. యూఎస్ ఓపెన్‌లో ఖాళీ చేతులతోనే ఇంటిదారిపట్టాడు. గతేడాది యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన జకో ఏ కేటగిరీలోనైనా అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధించిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రీడాకారిణి మార్గరెట్ కోర్టుతో సమంగా నిలిచాడు. ఇటీవలే పారిస్ ఒలింపిక్స్‌ చాంపియన్‌గా నిలిచి గోల్డెన్ స్లామ్ కలను నెరవేర్చుకున్న జకో.. యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాలనుకున్నాడు. అయితే, అతని ఆశలు మూడో రౌండ్‌లో గల్లంతయ్యాయి.

జకోకు ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్సీ పాప్రియన్ షాకిచ్చాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో జకోను 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో ఓడించాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ పాప్రియన్ సంచలన ప్రదర్శన చేశాడు. డిఫెండింగ్ చాంపియన్‌‌ను సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డాడు. 15 ఏస్‌లు, 50 విన్నర్లు బాదిన అతను 5 సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. జకో నుంచి గట్టి పోటీ ఎదురైనా ఏ మాత్రం పట్టుదల వదలని పాప్రియన్ మొదట తొలి రెండు సెట్లను నెగ్గి పట్టు సాధించాడు. మూడో సెట్‌ను కోల్పోయినా.. నాలుగో సెట్‌లో మళ్లీ పుంజుకుని మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు.

జకో 14 డబుల్ ఫౌల్ట్స్, 49 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. జకో 18 ఏళ్లలో యూఎస్ ఓపెన్‌లో 4వ రౌండ్‌కు చేరుకోవడంలో విఫలమవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, అతను ఈ ఏడాదిలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవలేదు. 2017 తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ లేకుండా సీజన్ ముగించడం కూడా ఇదే మొదటిసారి. శుక్రవారం మరో టైటిల్ ఫేవరెట్ కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్) ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed