డబ్ల్యూటీసీ గురించి ఆలోచించట్లేదు.. మా ఫోకస్ అంతా దానిపైనే : గంభీర్

by Harish |
డబ్ల్యూటీసీ గురించి ఆలోచించట్లేదు.. మా ఫోకస్ అంతా దానిపైనే : గంభీర్
X

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధిస్తామా?లేదా? అన్న దాని గురించి ఆలోచించడం లేదని, ఆస్ట్రేలియాలో గెలవడంపైనే దృష్టి పెట్టామని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లేముందు సోమవారం ముంబైలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ పలు విషయాలపై స్పందించాడు. గతంలో జరిగిన దాని గురించి పట్టించుకోకుండా తమకు ప్రతి సిరీస్ ముఖ్యమైనదేనన్నాడు. తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ దూరమైతే జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారు? అనే ప్రశ్నకు గంభీర్.. బుమ్రా అని సమాధానమిచ్చాడు. ‘బుమ్రా వైస్ కెప్టెన్. రోహిత్ అందుబాటులో లేకపోతే పెర్త్‌లో జట్టుకు బుమ్రా నాయకత్వం వహిస్తాడు.’ అని చెప్పాడు. అలాగే, రోహిత్ ఆడకపోతే తొలి టెస్టులో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని తెలిపాడు. ‘అనుభవజ్ఞులైన ప్లేయర్లతో వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. రాహుల్ టాపార్డర్, మిడిలార్డర్, నం.6లో కూడా బ్యాటింగ్ చేయగలడు. కీపింగ్ కూడా చేస్తాడు.’ అని చెప్పుకొచ్చాడు.

బెస్ట్ క్రికెట్ ఆడలేదు

న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అవడంపై స్పందిస్తూ.. తాము ఇంకా మెరుగ్గా ఆడాల్సిందని అంగీకరించాడు. ‘కివీస్ ప్లేయర్లు ప్రొఫెషనల్స్‌లా ఆడారు. దాన్ని అంగీకరించాల్సిందే. మేము మా బెస్ట్ క్రికెట్ ఆడలేదని నాకు తెలుసు. కానీ, ఓటమితో దేనిని మార్చాలనుకోవడం లేదు. విమర్శలను తీసుకుంటాం. ముందుకు వెళ్తూనే ఉంటాం. మెరుగుపడుతూనే ఉంటాం.’ అని తెలిపాడు. విమర్శలపై మాట్లాడుతూ..‘సోషల్ మీడియా నా జీవితంలోనైనా, ఎవరి జీవితంలోనైనా ఎలాంటి తేడాను ఇస్తుంది. హెడ్ కోచ్ పదవి కఠినమైన, ప్రతిష్టాత్మకమైన ఉద్యోగమని నాకు తెలుసు. నా పని నిజాయతీగా ఉండటమే. కాబట్టి, విమర్శల వల్ల నేను ఒత్తిడికి గురికాను.’ అని చెప్పాడు.

పాంటింగ్‌కు కౌంటర్

రోహిత్, కోహ్లీపై ఫామ్‌పై విమర్శలు చేసిన ఆసిస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్‌కు గంభీర్ కౌంటర్ ఇచ్చాడు. పాంటింగ్ ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించుకోవడం మంచిదన్నాడు. ‘పాంటింగ్‌కు భారత క్రికెట్ గురించి ఆందోళన అవసరం లేదు. విరాట్, కోహ్లీ కఠిన వ్యక్తులు. భారత క్రికెట్ కోసం ఎంతో చేశాడు. ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత సిరీస్‌లో జరిగిన దాని తర్వాత వారు మరింత ఆకలితో ఉన్నారు’ అని తెలిపాడు.

ఎలాంటి సవాల్‌కైనా సిద్ధం

ఆస్ట్రేలియాలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘ఎలాంటి పిచ్ అయినా మేము సిద్ధమే. వారు ఏదైనా ఇవ్వండి. ఎలాంటి సవాల్‌కైనా మేము సిద్ధం. మా సామర్థ్యానికి తగ్గట్టు ఆడితే వారిని ఓడించగలం. మొదటిది, ప్రధానమైన సవాల్ వాతావరణమే. సన్నద్ధతకు 10 రోజులు చాలానుకుంటున్నా. సిరీస్‌కు ముందు సరైన సన్నద్ధత పొందితే మెరుగైన స్థితిలో ఉంటాం. కాబట్టి, 10 రోజులు చాలా కీలకం.’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed