కివీస్‌తో తొలి టెస్టులో పట్టు సాధించిన ఆస్ట్రేలియా

by Harish |
కివీస్‌తో తొలి టెస్టులో పట్టు సాధించిన ఆస్ట్రేలియా
X

దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు సాధించింది. గ్రీన్(174) భారీ శతకానికి తోడు స్పిన్నర్ నాథన్ లైయన్(4/43) ధాటికి కివీస్ స్వల్ప స్కోరుకు పరిమితమవడంతో ఆసిస్ రెండో రోజు ఆధిపత్య స్థితిలో నిలిచింది. మొదట ఓవర్‌నైట్ స్కోరు 279/9‌తో శుక్రవారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 383 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. సెంచరీ వీరుడు గ్రీన్ టెయిలెండర్ హాజెల్‌వుడ్‌తో కలిసి 10 వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. హాజెల్‌వుడ్ వికెట్‌తో కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన న్యూజిలాండ్ 179 పరుగులకే ఆలౌటైంది. టామ్ లాథమ్(5), విల్ యంగ్(9), విలియమ్సన్(0), రచిన్ రవీంద్ర(0), డారిల్ మిచెల్(11) నిరాశపర్చడంతో కివీస్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి 100 పరుగుల లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే, గ్లెన్ ఫిలిప్స్(71) పోరాటానికితోడు మ్యాట్ హెన్రీ(42), టామ్ బ్లండల్(33) విలువైన పరుగులు జోడించడంతో ఆ స్కోరైనా దక్కింది. ఆసిస్ బౌలర్లలో నాథన్ లైయన్ 4 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించగా.. హాజెల్‌వుడ్ 2 వికెట్లు, స్టార్క్, కమిన్స్, మార్ష్ చెరో వికెట్ పడగొట్టారు. రెండో రోజే రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆస్ట్రేలియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(5 బ్యాటింగ్), నాథన్ లైయన్(6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 204 పరుగులు కలుపుకుని ఆస్ట్రేలియా 217 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed