MS Dhoni: ఐపీఎల్‌లో రిటైర్మెంట్ తర్వాత సైన్యంలో..

by Vinod kumar |
MS Dhoni: ఐపీఎల్‌లో రిటైర్మెంట్ తర్వాత సైన్యంలో..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL కు వీడ్కోలు పలికాక మహేంద్ర సింగ్‌ ధోని ఏం చేస్తాడు..? ఈ ప్రశ్నకు భిన్నమైన సమాధానాలు రావొచ్చు. మరి ధోనినే అడిగితే.. అతడి నుంచి కూడా స్పష్టమైన సమాధానం రాలేదు. ఏం చేస్తానో తెలియదు.. కానీ సైన్యంలో కచ్చితంగా కొంతకాలం సేవలు అందిస్తానని అన్నాడు. ఐపీఎల్‌కు వీడ్కోలు తర్వాత ఏం చేస్తారంటూ ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ధోని బదులిస్తూ.. ‘‘దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంకా క్రికెట్‌ ఆడుతున్నా. ఐపీఎల్‌లో బరిలో ఉన్నా. వీడ్కోలు తర్వాత ఏం చేస్తానన్నది ఆసక్తికరంగా ఉంటుంది. కచ్చితంగా కొంత కాలం సైన్యంలో పనిచేస్తా. గత కొన్నేళ్లుగా ఆ పని చేయలేకపోయా’’ అని తెలిపాడు.

గతంలో టీమిండియాకు ఆడే సమయంలోనే ధోనీ.. భారత ఆర్మీలో చేరి దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించాడు. ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోనీ.. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత కశ్మీర్ లోయలోని 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో విధులు నిర్వర్తించాడు. పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీలు చేయడంతో పాటు భద్రతా దళాలతో ఎక్కువ సమయం గడిపాడు. ఆర్మీలో పనిచేయాలనేది ధోనీ కల. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన వెంటనే అతనికి ఇండియన్ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చింది. సమయం దొరికినప్పుడల్లా ఆర్మీలో సేవ చేసేందుకు ధోనీ ఆసక్తి కనబర్చాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్దమవుతున్న 42 ఏళ్ల ధోనీకి ఇదే చివరి సీజన్ కానుంది. గతేడాదే వీడ్కోలు పలుకుతాడని భావించినా.. అతను తన రిటైర్మెంట్ ప్రణాళికను ఈ ఏడాదికి వాయిదా వేసాడు.

Advertisement

Next Story

Most Viewed