మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో సింధు ఓటమి

by Harish |
మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో సింధు ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాలని చూసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు‌కు నిరాశే ఎదురైంది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా మాస్టర్స్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన ప్రదర్శన చేసిన ఆమె టైటిల్‌ దిశగా సాగింది. అయితే, ఫైనల్‌లో సింధు ఆశలు గల్లంతయ్యాయి. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో సింధు 21-16, 5-21, 16-21 తేడాతో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యి చేతిలో పరాజయం పాలైంది.

గంటా 19 నిమిషాలపాటు ఆసక్తికరంగా సాగిన పోరులో సింధు పోరాడి ఓడింది. అయితే, ఈ మ్యాచ్‌లో మొదట శుభారంభం సింధుదే. ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీని అధిగమించి మరి ఆమె తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధు జోరు ప్రదర్శించలేకపోయింది. చైనా షట్లర్ దూకుడుగా ఆడి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. అక్కడ మొదట్లో సింధుదే జోరు. 11-3తో ఆధిక్యం కనబర్చి విజేతగా నిలిచేలా కనిపించింది. కానీ, చైనా షట్లర్ అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా పాయింట్లు నెగ్గి 13-13తో స్కోరును సమం చేయగా.. ఆ తర్వాత సింధు ఒత్తిడికి లోనైంది. పలు తప్పిదాలతో మ్యాచ్‌ను కోల్పోయి రన్నరప్‌గా సరిపెట్టింది. సింధు చివరిసారిగా 2022లో సింగపూర్ ఓపెన్ విజేతగా నిలిచింది. అప్పటి నుంచి మరో టైటిల్ గెలవలేదు.

Advertisement

Next Story

Most Viewed