Vinesh Phogat: వినేశ్ రిటైర్‌మెంట్ నిర్ణయంపై స్పందించిన మహవీర్ సింగ్ ఫోగాట్

by Ramesh Goud |
Vinesh Phogat: వినేశ్ రిటైర్‌మెంట్ నిర్ణయంపై స్పందించిన మహవీర్ సింగ్ ఫోగాట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒలంపిక్స్ లో స్వర్ణం వరకు చేరుకొని అనర్హతకు గురైన వినేశ్ ఫోగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. పారిస్ ఒలంపిక్స్ రెజ్లింగ్ లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఫైనల్ కు చేరుకొని 100 గ్రాముల అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైంది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైనా ఆమె రెజ్లింగ్ కు వీడ్కోలు పలికింది. దీనిపై ఆమె చిన్ననాటి కోచ్, పెదనాన్న మహవీర్ సింగ్ ఫోగాట్ స్పందిస్తూ.. పతకానికి చేరువగా వచ్చి కోల్పోవడం వినేశ్ ను మానసికంగా కుంగదీసిందని, అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని చెప్పారు. అలాగే రిటైర్మెంట్ నుంచి వెనక్కి రావాలని ఆయన కోరారు. అంతేగాక ఆమెతో కూర్చొని మాట్లాడతాని, అర్ధమయ్యేలా వివరిస్తానని, మళ్లీ సాధన చేస్తే విజేతగా నిలవడం పెద్ద కష్టం కాదని తెలిపారు.

ఇక కోపంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారని, మళ్లీ వచ్చే ఒలంపిక్స్ వినేశ్ ను సిద్దం చేస్తానని మహవీర్ హమీ ఇచ్చారు. కాగా వినేశ్ ఎక్స్ లో "తల్లి లాంటి కుస్తీ నా మీద గెలిచింది. నేను ఓడిపోయాను నన్ను క్షమించండి అన్నది. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి అని చెబుతూ.. ఇక నాకు పోరాడే బలం లేదు. మీ అందరికీ రుణపడి ఉంటా" అని ఎక్స్ లో రాసుకొచ్చింది. వినేశ్ నిర్ణయంపై క్రీడాభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా తనను అనర్హురాలుగా ప్రకటించడాన్ని వినేశ్ ఫోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లో సవాల్ చేసినట్లు తెలిసింది. అంతేగాక తాను సిల్వర్ మెడల్ కు అర్హురాలినని ఫిర్యాదు లో తెలిపినట్లు సమాచారం. ఇక దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఎలాంటి తీర్పు వెలువరుస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed