Spain Masters 2024 : తొలి రౌండ్‌లోనే గాయత్రి జోడీ ఓటమి

by Harish |
Spain Masters 2024 : తొలి రౌండ్‌లోనే గాయత్రి జోడీ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్‌లో మంగళవారం ప్రారంభమైన స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ జోడీ గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ నిరాశపర్చింది. ఉమెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో గాయత్రి జోడీ 18-21, 22-20, 18-21 తేడాతో అమెరికాకు చెందిన అన్నీ జు-కెర్రీ జు చేతిలో ఓడిపోయింది. గంటకుపైగా హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో గాయత్రి జోడీ అంత తేలిగ్గా మ్యాచ్‌ను సమర్పించుకోలేదు. చివరి వరకూ పోరాడింది. తొలి గేమ్ కోల్పోయిన తర్వాత అద్భుతంగా పుంజుకున్న గాయత్రి జంట రెండో గేమ్‌ను దక్కించుకుని పోటీలోకి వచ్చింది. అయితే, నువ్వానేనా అన్నట్టు జరిగిన మూడో గేమ్‌లో ప్రత్యర్థి జోడీకి గట్టి పోటీనిచ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో గాయత్రి-ట్రీసా జాలీ జంట తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది.

మరోవైపు, మెన్స్ డబుల్స్‌లో క్రిష్ణప్రసాద్-సాయి ప్రతీక్ జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో భారత జంట 21-15, 28-30, 21-11 తేడాతో 4వ సీడ్, కెనడాకు చెందిన ఆడమ్ డాంగ్-నైల్ యాకురా జోడీని మట్టికరిపించి రెండో రౌండ్‌కు చేరుకుంది. మెన్స్ సింగిల్స్‌లో యువ ఆటగాడు మిథున్ మంజునాథ్ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. క్వాలిఫయర్స్ తొలి రౌండ్‌లో మిథున్ 15-21, 24-22, 21-18 తేడాతో సహచరుడు సుబ్రమణియన్‌పై విజయం సాధించాడు. రెండో రౌండ్‌లో చైనీస్ తైపీ షట్లర్ జువో పు లియావో‌ను 21-16, 21-12 తేడాతో ఓడించి మెయిన్ డ్రాకు క్వాలిఫై అయ్యాడు.

Advertisement

Next Story