అతన్ని కలిసి మాట నిలబెట్టుకున్న సచిన్.. రియల్ హీరో అంటూ ప్రశంసలు

by Harish |
అతన్ని కలిసి మాట నిలబెట్టుకున్న సచిన్.. రియల్ హీరో అంటూ ప్రశంసలు
X

దిశ, స్పోర్ట్స్ : కశ్మీర్‌కు చెందిన పారా క్రికెటర్ అమీర్ హుస్సేన్ చేతులు లేకుండా తల సాయంతో బ్యాటింగ్ చేస్తున్న వీడియో గత నెలలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కంట పడింది. అమీర్‌ను అభినందిస్తూ ట్వీట్ చేసిన సచిన్.. ఏదో ఒక అతన్ని కలసుకుంటానని చెప్పాడు. తాజాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి కశ్మీర్‌లో పర్యటనలో ఉన్న సచిన్.. మంగళవారం అమీర్ హుస్సేన్‌ను కలుసుకున్నాడు. ఆరాధ్య క్రికెటర్‌ను కలుసుకోవడంతో అమీర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా సచిన్ అమీర్‌కు బ్యాటును గిఫ్ట్‌గా ఇచ్చాడు. తాను తల సహాయంతో ఎలా బ్యాటింగ్ చేస్తానో సచిన్‌కు అమీర్ వివరించాడు. ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన సచిన్.. రియల్ హీరోను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని రాసుకొచ్చాడు. సచిన్ పోస్టు చేసిన వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని నిరూపించాడు అమీర్ హుస్సేన్. 1997లో అమీర్ ఎనిమిదేళ్ల వయసులో రెండు చేతులను కోల్పోయాడు. తమ కుటుంబం నడిపించే వండ్రంగి షాపులో అనుకోకుండా అమీర్ జాకెట్ కట్టె మిషన్‌లో ఇరుక్కుపోయి తన రెండు చేతులను పొగొట్టుకున్నాడు. విధి కన్నెర్ర చేసినా అతను మాత్రం బతుకు పోరాటం ఆపలేదు. క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అమీర్.. తల సాయంతో బ్యాటింగ్ చేయడంపై పట్టు సాధించాడు. అతనికి కుటుంబం మద్దతుగా నిలిచింది. 2013లో ఓ ఉపాధ్యాయుడు అమీర్‌లోని ప్రతిభను గుర్తించి అక్కడి పారా క్రికెట్ టీమ్‌లో చేర్పించాడు. ప్రస్తుతం అతను జమ్మూ కశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌‌గా వ్యవహరిస్తున్నాడు. 2016లో భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ముంబైలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు అమీర్‌ను ఆహ్వానించాడు.

Advertisement

Next Story