లక్ష్యసేన్ హవా.. ప్రీక్వార్టర్స్‌లో 4వ సీడ్‌కు షాకిచ్చిన భారత స్టార్

by Harish |
లక్ష్యసేన్ హవా.. ప్రీక్వార్టర్స్‌లో 4వ సీడ్‌కు షాకిచ్చిన భారత స్టార్
X

దిశ, స్పోర్ట్స్ : ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ హవా కొనసాగుతోంది. తాజాగా అతను క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 24-22, 11-21, 21-14 తేడాతో 4వ సీడ్, డెన్మార్క్ స్టార్ అండర్స్ ఆంటోన్సెన్‌ను చిత్తు చేశాడు. గంటా 20 నిమిషాలపాటు ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో లక్ష్యసేన్ అద్భుత ప్రదర్శన చేశాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి గేమ్‌ను పోరాడి మరి గెలుచుకుని శుభారంభం చేశాడు. అయితే, రెండో గేమ్‌లో ప్రత్యర్థి లక్ష్యసేన్‌కు షాకిచ్చాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆరంభంలోనూ డెన్మార్క్ ప్లేయర్ దూకుడు కొనసాగింది. ఒక దశలో 12-6తో లక్ష్యసేన్ వెనుకబడగా ఓటమి ఖాయమే అనిపించింది. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న లక్ష్యసేన్ 14-14తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుసగా 7 పాయింట్లు నెగ్గి మూడో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు.

సింధు నిష్ర్కమణ

ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు పోరాటం ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో ఓడి ఇంటిదారిపట్టింది. మూడో రౌండ్‌లో సింధు 19-21, 11-21 తేడాతో టాప్ సీడ్, కొరియాకు చెందిన యాన్ సె యంగ్ చేతిలో పరాజయం పాలైంది. ఆసక్తికరంగా సాగిన తొలి గేమ్‌ను సింధు పోరాడి కోల్పోయింది. ఒకదశలో 17-11తో వెనుకబడిన ఆమె పుంజుకుని 17-16తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించినా గేమ్‌ను గెలుచుకోలేకపోయింది. ఇక, రెండో గేమ్‌లో ప్రత్యర్థిని దూకుడున సింధు నిలువరించలేక మ్యాచ్‌ను టాప్ సీడ్‌కు సమర్పించుకుంది. ఉమెన్స్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప జోడీ కూడా ప్రతికూల ఫలితమే వచ్చింది. మూడో రౌండ్‌ల భారత జంట 21-11, 11-21, 11-21 తేడాతో చైనాకు చెందిన జాంగ్ షు జియాన్-జెంగ్ యు జోడీ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

Advertisement

Next Story