Paris Olympics : అథ్లెటిక్స్‌లో మన మెరుపు.. జ్యోతి‌పై భారీ ఆశలు

by Harish |
Paris Olympics : అథ్లెటిక్స్‌లో మన మెరుపు.. జ్యోతి‌పై భారీ ఆశలు
X

దిశ, స్పోర్ట్స్ : అథ్లెటిక్స్ అంటే అందరి చూపు నీరజ్ చోప్రాపైనే. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం నెగ్గిన నీరజ్ అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు. పారిస్ ఒలింపిక్స్‌లోనూ అతనికి ఓ పతకం ఖాయమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అథ్లెటిక్స్‌లో విశాఖపట్నం అమ్మాయి యర్రాజి జ్యోతికి కూడా పతకం తెచ్చే సత్తా ఉంది. కొంతకాలంగా ఆమె ప్రదర్శన చూసిన వారంతా ఇదే మాట చెబుతున్నారు. 100 మీటర్ల హార్డిల్స్‌లో పోటీపడుతున్న తొలి భారత అథ్లెట్‌గా ఒలింపిక్స్‌కు ముందే రికార్డు సృష్టించిన జ్యోతి.. తొలి విశ్వక్రీడల్లోనే పతకం తెస్తే ఆ ఆనందమే వేరు.

సంచలనాల జ్యోతి

కొంతకాలంగా తెలుగమ్మాయి జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నది. మేలో ఫిన్లాండ్‌లో జరిగిన మోనెల్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నీలో ఆమె 0.1 సెకన్లతో నేరుగా ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే, వరల్డ్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆమె తొలి విశ్వక్రీడల్లో పాల్గొంటుంది. 100 మీటర్ల హార్డిల్స్‌లో ఆమె నిలకడగా రాణిస్తున్నది. తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ వస్తోంది. ఎన్నోసార్లు జాతీయ రికార్డును బద్దలుకొట్టింది. గతేడాది ఆసియా క్రీడల్లో రజతం సాధించి 100 మీటర్ల హార్డిల్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా ఘనత సాధించింది. అలాగే, గతేడాది ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. 12.78 సెకన్లు ఆమె అత్యుత్తమ ప్రదర్శన. 13 సెకన్ల లోపు 100 మీటర్ల హార్డిల్స్‌ను పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్‌గా ఆమె పేరిట రికార్డు లిఖించుకుంది. ఆసియాలో రెండో ఫాస్టెస్ట్ అథ్లెట్. గత మూడేళ్లలో ఆమె దాదాపు 10 సార్లు 13 సెకన్లలోపే ప్రదర్శన చేసింది. ఒలింపిక్స్‌లో ఒత్తిడిని తట్టుకుంటే జ్యోతి పతకం సాధించడం ఖాయమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 12.5 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని చేరుకుంటే పతకం దక్కొచ్చని చెబుతున్నారు.

తొలి ఒలింపిక్స్‌కు జ్యోతిక శ్రీ

ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన దండి జ్యోతిక శ్రీ కూడా తొలి ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మహిళల 4X400 మీటర్ల రిలే ఈవెంట్‌లో ఆమె పోటీపడనుంది. శుభా వెంకటేసన్, విత్యా రామ్‌రాజ్, పూవమ్మలతో కలిసి జ్యోతిక‌ పతకం తెస్తుందో లేదో చూడాలి. డాక్టర్ కావాలనుకున్న జ్యోతిక ఆమె తండ్రి ప్రోత్సాహంతో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఓనమాలు దిద్దింది. వ్యక్తిగతంగా 400 మీటర్ల రేసులో పాల్గొనే జ్యోతిక.. 2021లో జాతీయ అండర్-23 చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది. గతేడాది జాతీయ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే, గతేడాది ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల 4X400 మీటర్ల రిలే జట్టు కాంస్యం నెగ్గడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.



Next Story