Asian Athletics Championships 2023: సంచలనం సృష్టించిన తెలుగమ్మాయి.. హార్డిల్స్‌లో స్వర్ణం

by Vinod kumar |
Asian Athletics Championships 2023: సంచలనం సృష్టించిన తెలుగమ్మాయి.. హార్డిల్స్‌లో స్వర్ణం
X

బ్యాంకాక్ : తెలుగమ్మాయి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా అథ్లెట్ యర్రాజి జ్యోతి సంచలనం సృష్టించింది. ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌‌‌లో స్వర్ణంతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో 13.09 సెకన్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించింది. రేసులో జపాన్ క్రీడాకారిణి అసుక తేరడ(13.13 సెకన్లు), అదే దేశానికి మరో క్రీడాకారిణి ముసుమి అయోకి(13.26 సెకన్లు) నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న జ్యోతి వారిని వెనక్కినెట్టి లక్ష్యాన్ని ముందే పూర్తి చేసింది. దాంతో ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో 100 మీటర్ల హార్డిల్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించి జ్యోతి చరిత్ర సృష్టించింది.

అలాగే, తొలి ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బరిలోనే ఆమె ఏకంగా స్వర్ణం గెలుచుకోవడం విశేషం. ఓ ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్‌లోనూ జ్యోతికి ఇదే తొలి స్వర్ణం. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ నిత్య రామరాజ్(13.55 సెకన్లు) నాలుగో స్థానంతో సరిపెట్టింది. అలాగే, ఈ టోర్నీలో వివిధ ఈవెంట్లలో భారత అథ్లెట్లు సత్తాచాటారు. పురుషుల 1,500 మీటర్ల ఈవెంట్‌లో భారత అథ్లెట్ అజయ్ కుమార్ సరోజ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. అతను 3:41.51 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని అగ్రస్థానంలో నిలిచి విజేతగా నిలిచాడు.

పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబుబాకర్ 16.92 మీటర్ల ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే, డెకథ్లాన్ ఈవెంట్‌లో భారత స్టార్ అథ్లెట్ తేజస్విని శంకర్ 7, 527 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నాడు. టోర్నీ చరిత్రలో డెకథ్లాన్‌లో భారత్ పతకం గెలవడం ఇదే తొలిసారి. అలాగే, మహిళల 400 మీటర్ల ఈవెంట్‌లో ఐశ్వర్య మిశ్రా 53.07 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంతో కాంస్యం కైవసం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed