రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ పొలిటికల్ ఎంట్రీ.. మాహిం నుంచి పోటీ

by Mahesh Kanagandla |
రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ పొలిటికల్ ఎంట్రీ.. మాహిం నుంచి పోటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ ఠాక్రే బరిలోకి దిగనున్నారు. ముంబయిలోని మాహిం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమిత్ ఠాక్రే పోటీ చేయనున్నట్టు ఎంఎన్ఎస్ ప్రకటించింది. 45 మంది అభ్యర్థుల జాబితాను ఎంఎన్ఎస్ ఈ రోజు విడుదల చేసింది. ఇందులో అమిత్ ఠాక్రే పేరు కూడా ఉండటంతో తొలిసారి ఆయన ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు స్పష్టమైంది. ఎంఎన్ఎస్ ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ సందీప్ దేశ్‌పాండే వర్లీ నుంచి, పార్టీ ఏకైక ఎమ్మెల్యే ప్రమోద్ పాటిల్ కళ్యాణ్ రూరల్ సీటు నుంచి మరోసారి పోటీ చేయనున్నారు.

ఎంఎన్ఎస్ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనుంది. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే కూడా తామే ఎక్కువ సీట్లల్లో పోటీ చేయబోతున్నట్టు తెలిపింది. 2014, 2019 ఎన్నికల్లో ఎంఎన్ఎస్ ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెలుచుకుంది. ఈ సారి తమ సత్తా చాటుతామని, అత్యధికంగా సీట్లు గెలుచుకుని అధికారంలో ఉంటామని రాజ్ ఠాక్రే విశ్వాసంగా చెప్పారు. 2014లో నరేంద్ర మోదీకి మద్దతు ఇచ్చిన రాజ్ ఠాక్రే ఆ తర్వాత ఆయనపై విమర్శలు కురిపించారు. మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పలుమార్లు మండిపడ్డారు.

Advertisement

Next Story