World Athletics: 200 మీటర్ల సెమీఫైనల్‌ రేసులో అనూహ్య పరిణామం.. అథ్లెట్‌ కంటికి గాయం

by Vinod kumar |
World Athletics: 200 మీటర్ల సెమీఫైనల్‌ రేసులో అనూహ్య పరిణామం.. అథ్లెట్‌ కంటికి గాయం
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2023లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పురుషుల 200 మీటర్ల సెమీఫైనల్‌ రేసు ప్రారంభానికి ముందు ప్రమాదం చోటు చేసుకుంది. సెమీఫైనల్ రేసు కాసేపట్లో మొదలు కావాల్సి ఉండగా.. ఈ పోటీలో పాల్గొనే అథ్లెట్లను ట్రాక్‌ దగ్గరికి తీసుకెళ్తున్న వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఊహించని ఘటనతో కలకలం రేగింది. ఇది చిన్న ప్రమాదమే అయినప్పటికీ.. రేసులో పాల్గొనాల్సిన జమైకా అథ్లెట్‌ ఆండ్రూ హడ్సన్‌ కంటికి గాయం కావడం ఆందోళన రేకెత్తించింది. కుడి కంట్లోకి చిన్న చిన్న గాజు ముక్కలు వెళ్లి తాత్కాలికంగా చూపు మందగించడంతో అతను రేసులో పాల్గొనడంపై ఉత్కంఠ నెలకొంది.

అయితే అతనికి ప్రథమ చికిత్స అందించిన వైద్యులు ప్రమాదం లేదని, పోటీలో పాల్గొనవచ్చని స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కంటిని పూర్తిగా తెరవలేని స్థితిలోనే హడ్సన్‌ రేసులో పాల్గొన్నాడు. సెమీస్‌ పోరులో హడ్సన్‌ ఐదో స్థానంలో నిలిచాడు. సాధారణంగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లకే ఫైనల్‌ చేరే అవకాశముంటుంది. అయితే హడ్సన్‌ కంటి గాయం అయిన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో అతనికి ఫైనల్లో పోటీ పడే అవకాశం కల్పించారు.

దీంతో ఎప్పటిలా 8 మంది కాకుండా రెండు సెమీస్‌ల నుంచి మొత్తం 9 మంది తుది పోరుకు అర్హత సాధించారు. 26 ఏళ్ల హడ్సన్‌కు ఇదే తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కావడం విశేషం. శుక్రవారం జరిగిన 200 మీటర్ల ఫైనల్ రేసులో డిఫెండింగ్ ఛాంపియన్, అమెరికన్ నోహ్ లైల్స్ స్వర్ణం సాధించాడు. 19.52 సెకండ్లలో రేసును పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అమెరికాకే చెందిన ఎరియాన్ నైటన్ 19.75 టైమింగ్‌తో సిల్వర్ మెడల్ సాధించాడు. గాయపడిన జమైకా స్ప్రింటర్ ఆండ్రూ హడ్సన్‌ 8వ స్థానంలో నిలిచాడు.

Advertisement

Next Story