- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త కెప్టెన్లు ఏం చేస్తారో.. హార్దిక్, గిల్‌కు సరికొత్త సవాళ్లు
దిశ, స్పోర్ట్స్: దేశంలో ఐపీఎల్ సందడి మొదలుకాబోతోంది. భారత క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఈ మెగా టోర్నీ ‘సీజన్- 17’ శుక్రవారం నుంచే ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం 10 జట్లు ఉండగా, రెండు జట్లు మాత్రం ఈసారి ఇతర టీమ్‌లకంటే ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ టోర్నీలో ఆ జట్ల ప్రదర్శన ఎలా ఉండబోతుంది? వాళ్ల కెప్టెన్లు టీమ్‌ను ఎలా నడిపించనున్నారు? అనేదానిపై ఆయా జట్ల అభిమానులతోపాటు ఇతర టీమ్‌ల అభిమానులు సైతం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఒక జట్టేమో ‘‘మాకు మేమే పోటీ.. మాతో మాకే పోటి’’ అనే రీతిలో టైటిళ్లు గెలవడంలో ఫేమస్ అయితే.. ‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. కప్పు కొట్టామా? లేదా’’ అనేలా మరో జట్టు. ఆ రెండు జట్లే.. ‘‘ముంబై ఇండియన్స్’’.. ‘‘గుజరాత్ టైటాన్స్’’. ఇతర జట్లతో పోలిస్తే రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత విజయవంతంగా కొనసాగుతూవస్తోంది. రెండేళ్ల క్రితమే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో, వచ్చిన ఏడాదిలోనే టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది. గత సీజన్‌లోనూ ఫైనల్లోకి చేరి రెండో టైటిల్‌ను తృటిలో చేజార్చుకుంది. ఈ రెండు జట్లనూ విజయవంతంగా నడిపించిన కెప్టెన్లు ఇప్పుడు మారారు. ముంబై కెప్టెన్సీ బాధ్యతల నుంచి జట్టు యాజమాన్యం రోహిత్‌ను తప్పించింది. అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చింది. ఇక, గుజరాత్ కెప్టెన్సీని వదులుకున్న హార్దిక్ పాండ్యా.. ముంబై జట్టు సారథిగా వెళ్లాడు. దీంతో అతని స్థానంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా యువ బ్యాటర్ శుభమన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు. దీంతో సంచలనాత్మ గుజరాత్ జట్టును గిల్, సక్సెస్‌ఫుల్ ముంబై జట్టును హార్దిక్ పాండ్యా ఎలా నడిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
రోహిత్‌ను మరిపిస్తాడా?
రోహిత్ నాయకత్వంలోని ముంబై జట్టు.. 2013, 2015, 2017, 2019, 2020లో విజేతగా నిలిచి టోర్నీలో అత్యధిక టైటిళ్లు సాధించిన తొలి జట్టుగా అవతరించింది. గతేడాది ప్లేఆఫ్స్‌కు చేరుకుని, క్వాలిఫయర్స్ నుంచి వెనక్కి వచ్చింది. ఈ క్రమంలోనే రోహిత్ స్థానంలో కొత్తగా సారథ్య బాధ్యతలు తీసుకున్న హార్దిక్.. జట్టుకు ఆరో టైటిల్ అందించాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా, 24న గుజరాత్ జట్టుతో ముంబై తలపడనుంది. దీంతో తొలి మ్యాచే ఆసక్తికరంగా మారనుంది. ఈ జట్టు బలాలు, బలహీనతలను పరిశీలిస్తే, రోహిత్, హార్దిక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లతో కాగితంపై బలంగా కనిపిస్తోంది. గాయంతో గత సీజన్‌కు దూరమైన బుమ్రా ఈ సీజన్‌లో బౌలింగ్ దళాన్ని నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. బుమ్రాతోపాటు కోయెట్జీ, మధుశంకలతో జట్టు మంచి పేస్ బౌలర్లను కలిగి ఉంది. మరోవైపు, స్పిన్నర్ పీయూష్ చావ్లా గతేడాది అంతగా రాణించలేకపోయాడు. దీంతో చావ్లా ఈసారి కూడా విఫలమైతే అతని స్థానంలో కర్ణాటక స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్‌ను తీసుకునే అవకాశం ఉంది. దేశీయ బౌలర్లు కుమార్ కార్తికేయ, నేహాల్ వధేరా, షామ్స్ ములానీ అనుభవం లేకపోయినా కొన్ని ఓవర్ల స్పిన్ బౌలింగ్‌ను వేయగలరు. ఇదిలా ఉండగా, ఇన్నేళ్లు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్.. ఇప్పుడు కొత్త పాత్రకు ఎలా న్యాయం చేస్తాడో చూడాలి. నాయకత్వ ఒత్తిడి ఉండదు గనుక బ్యాటింగ్‌లో చెలరేగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముంబై పూర్తి జట్టు
బ్యాటర్లు: రోహిత్ శర్మ, డేవాల్డ్ బ్రేవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్
ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), మహ్మద్ నబీ, అర్జున్ టెండుల్కర్, రొమారియో షెఫెర్డ్, షామ్స్ ములానీ, నెహాల్ వాధెరా, కోయెట్జీ, అన్షుల్ కంబోజ్, నమన్ ధిర్, శివాలిక్ శర్మ
బౌలర్లు: బుమ్రా, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ సింగ్, ఆకాశ్ మధ్వాల్, జేసన్ బెహ్రెన్‌డర్ఫ్, దిల్షాన్ మధుశంక, శ్రేయస్ గోపాల్, నువాన్ థుషారా
గిల్‌కు పరీక్ష
హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఎంట్రీతోనే టైటిల్ సాధించిన గుజరాత్ టైటాన్స్.. తర్వాతి సీజన్‌లోనూ ఫైనల్ వరకు దూసుకెళ్లి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఏదో అదృష్టం బాగుండి ఆడిన మొదటి లీగ్‌లోనే టైటిల్ గెలుచుకుందనే విమర్శలకు చెక్ పెడుతూ, గతేడాది సైతం ఫైనల్లోకి దూసుకెళ్లి, తమ ప్రదర్శన గాలివాటం కాదని నిరూపించుకుంది. దీంతో గుజరాత్ జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థులకు గట్టి సవాలే అనే పరిస్థితి నెలకొంది. అన్నీ బానే ఉన్నాయనుకున్న సమయంలోనే జట్టు నుంచి కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెళ్లిపోయాడు. దీంతో ఆ బాధ్యతలను గిల్ అందుకున్నాడు. తనకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే గనుక గిల్‌కు ఎదురుండదు. కెప్టెన్‌గా తానేంటో నిరూపించుకుంటే భవిష్యత్‌లో టీమ్ ఇండియా సారథిగానూ పోటీలో ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ సీజన్ శుభమన్ గిల్‌కు పరీక్షగా మారింది. స్టార్ ప్లేయర్లకు కొదవలేని గుజరాత్‌ను గిల్ ఏ విధంగా నడిపిస్తాడో చూడాలి. గుజరాత్ జట్టు బలాలు, బలహీనతలు పరిశీలిస్తే.. టీమ్‌లో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేదు. జట్టు అద్భుతమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది. శుభమన్ గిల్, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, మాథ్యూ వాడే వంటి స్టార్లు ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరు విజృంభించినా మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగలరు. బౌలింగ్ దళాన్ని నడిపించేందుకు స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. పేసర్ ఉమేశ్ యాదవ్‌పైనా ఆశలు పెట్టుకోవచ్చు. ఇక, గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ నిలకడ, పటిష్టమైన బౌలింగ్ ప్రదర్శన వారి విజయానికి ప్రధాన కారణం. అయితే, హార్దిక్ పాండ్యా నిష్క్రమణ, మహ్మద్ షమీ గాయం జట్టుకు ఎదురుదెబ్బ. అలాగే, జట్టులో పేరుగాంచిన ఆల్ రౌండర్‌లు ఎవరూ లేరు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌లూ లేకపోవడం జట్టుకు ప్రతికూలాంశాలు.
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు
బ్యాటర్లు: డేవిడ్ మిల్లర్, శుభమన్ గిల్(కెప్టెన్), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా(కీపర్), రాబిన్ మింజ్, కేన్ విలియమ్సన్
ఆల్‌రౌండర్లు: అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయి, షారుఖ్ ఖాన్
బౌలర్లు: జయంత్ యాదవ్, రాహుల్ తేవాతియా, మహ్మద్ షమీ, కార్తి త్యాగి, సుశాంత్ మిశ్రా, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, మోహిత్ శర్మ, మానవ్ సుథార్