గబ్బా కంటే ఇండోర్ పిచ్ చాలా బెటర్: సన్నీ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
గబ్బా కంటే ఇండోర్ పిచ్ చాలా బెటర్: సన్నీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీరుపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన పిచ్‌కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇవ్వడాన్ని తప్పుబట్టాడు. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలోని గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్‌కు ఏ రేటింగ్ ఇచ్చారంటూ మండిపడ్డారు. గబ్బా కంటే ఇండోర్ పిచ్ చాలా బెటర్ అన్నాడు. తొలి రోజు నుంచే పిచ్‌పై టర్న్ ఉండటంతో బ్యాటర్లు బెంబేలెత్తిపోవడంతో మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది.

మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ పిచ్ నాసిరకంగా ఉందని, బంతి, బ్యాట్ మధ్య సమతూకంగా పోరు జరగలేదని ఐసీసీకి నివేధించాడు. అంతేకాకుండా పిచ్‌పై అనూహ్య బౌన్స్ కనిపించిందన్నాడు. బ్రాడ్ నివేదికతో ఐసీసీ ఇండోర్ పిచ్‌కు పూర్ రేటింగ్ ఇస్తూ మూడు డీ మెరిట్ పాయింట్లను విధించింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 14 రోజుల్లోపు అప్పీల్ చేసుకోవాలని బీసీసీఐకి సూచించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ మైదానానికి ఏడాది కాలంలో ఐదు డీమెరిట్ పాయింట్స్ వస్తే ఆ గ్రౌండ్‌ను ఐదేళ్ల పాటు నిషేధిస్తారు.

ఇండోర్ వికెట్‌కు పూర్ రేటింగ్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవాస్కర్ ఓ టీవీ చానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండోర్ మైదానానికి పూర్ రేటింగ్ ఇచ్చారు సరే, గతేడాది డిసెంబర్‌లో బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది కదా.. మరి గబ్బాకు ఎన్ని డీ మెరిట్ పాయింట్స్ ఇచ్చారో చెప్పాలన్నారు. ఆ టెస్టుకు మ్యాచ్ రిఫరీగా ఎవరు వ్యవహరించారని అని గవాస్కర్ ఘాటుగా ప్రశ్నించాడు.

ఇక డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సౌతాఫ్రికా డిసెంబర్ 17న గబ్బా వేదికగా రెండో టెస్టు ఆడింది. పేస్‌, బౌన్స్‌కు అనుకూలమైన పిచ్ రెడీ చేయడంతో ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 152 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా కూడా తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 35 పరుగులను ఛేదించడానికి 4 కీలక వికెట్లను కూడా కోల్పోయింది. రెండు రోజులు పూర్తి కాకుండానే మ్యాచ్ ముగిసింది. అప్పట్లో ఈ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాచ్‌లోనే ఆసీస్ స్టార్ ప్లేయర్స్ కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed