థామస్ అండ్ ఉబెర్ కప్‌లో భారత జట్లకు షాక్.. క్వార్టర్స్‌లోనే ఔట్

by Dishanational3 |
థామస్ అండ్ ఉబెర్ కప్‌లో భారత జట్లకు షాక్.. క్వార్టర్స్‌లోనే ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక థామస్ కప్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్ నిలబెట్టుకోవడంలో భారత్ విఫలమైంది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు క్వార్టర్స్‌లోనే తమ పోరాటాన్ని ముగించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనా చేతిలో 3-1 తేడాతో ఓటమిపాలైంది. తొలి గేమ్‌ సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21-15, 11-21, 14-21 తేడాతో షి యు క్వి చేతిలో ఓడటంతో భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఆ తర్వాత డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 15-21, 21-11, 12-21 తేడాతో లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చాంగ్ జంట చేతిలో ఓడటంతో ఓటమి అంచున నిలిచింది. రెండో సింగిల్స్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ జట్టుకు ఊరటనిచ్చాడు. లీ షి ఫెంగ్‌పై 21-13, 8-21, 14-21 తేడాతో నెగ్గి భారత్ పోటీలోకి వచ్చింది. అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లో ధ్రువ్ కపిల-సాయిప్రతీక్ జోడీ 10-21, 10-21 తేడాతో హీ జీ టింగ్-రెన్ జియాంగ్ యు చేతిలో ఓడటంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. మరో గేమ్ మిగిలి ఉండగానే భారత్ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. 2022లో భారత జట్టు విజేతగా నిలిచి తొలిసారి టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

మహిళల జట్టు మరోసారి క్వార్టర్స్‌లోనే

ఉబెర్ కప్‌లో మహిళల జట్టుకు కూడా క్వార్టర్స్‌లో నిరాశే ఎదురైంది. జపాన్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది. వరుస గేముల్లో అష్మిత, ప్రియ-శ్రుతి జోడీ, ఇషారాణి ఓడటంతో జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. గత ఎడిషన్‌లో క్వార్టర్స్‌లోనే నిష్ర్కమించిన భారత జట్టు.. మరోసారి క్వార్టర్స్‌ను దాటలేకపోయింది.

Next Story

Most Viewed