ఇండోనేషియా ఓపెన్ లో సింధు శుభారంభం

by Javid Pasha |
ఇండోనేషియా ఓపెన్ లో సింధు శుభారంభం
X

జకార్తా : ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సింధు 21-19, 21-15 తేడాతో వరల్డ్ నం.9, ఇండోనేషియాకు చెందిన గ్రెగోరియా మారిస్కా టుంజంగ్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి గేమ్‌ను గెలుచుకునేందుకు సింధు తీవ్రంగా కష్టపడింది. ఆరంభం నుంచి ఆమె ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదుర్కోంది. దాంతో ఆధిక్యం మారుతూ వచ్చింది. ఈ క్రమంలో 10-13తో లీడ్‌లోకి వెళ్లిన సింధు.. ఆ తర్వాత పట్టు వదలకుండా గేమ్‌ను ముగించింది. ఇక, రెండో గేమ్‌లో పూర్తి హవా సింధుదే. 6-10తో ప్రత్యర్థిని వెనక్కినెట్టిన ఆమె.. అదే జోరుతో రెండో గేమ్‌ను సాధించి టోర్నీలో రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. రెండో రౌండ్‌లో సింధు వరల్డ్ నం.3 తై జు యింగ్(చైనీస్ తైపీ)ని ఎదుర్కోనుంది. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సైతం రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌లో అతను 21-16, 21-14 తేడాతో జపాన్ ప్లేయర్ కెంటా నిషిమోటోపై నెగ్గాడు. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన ప్రణయ్.. రెండు గేమ్‌‌లో ప్రత్యర్థిని ప్రేక్షక పాత్రకే పరిమితం చేశాడు.

రెండో రౌండ్ హాంకాంగ్‌ ఆటగాడు అంగస్‌ ఎన్జి కా లాంగ్‌తో ప్రణయ్ తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జంట సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ సైతం శుభారంభాం చేసింది. తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌ జోడీ క్రిస్టో పోపోవ్-తోమా జూనియర్ పోపోవ్‌తో భారత ద్వయం తలపడగా.. తొలి గేమ్‌ను 21-17 తేడాతో గెలుచుకుంది. రెండో గేమ్‌లో 11-7తో ఆధిక్యంలో ఉండగా.. ప్రత్యర్థి జంట రైటర్డ్ అవడంతో సాత్విక్ జోడీని విజేతగా ప్రకటించారు. మరో భారత జోడీ అర్జున్-ధ్రువ్ కపిల తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. 8వ సీడ్, మలేషియా జోడీ ఓంగ్ యూ సిన్ - టియో ఈ యి చేతిలో 12-21, 21-6, 22-20 తేడాతో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి-ట్రీసా జాలీ ద్వయానికి సైతం నిరాశ తప్పలేదు. తొలి రౌండ్‌లో జపాన్‌కు చెందిన రిన్ ఇవాంగా-కీ నకనిషి చేతిలో 20-22, 21-12, 21-16 తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించింది. నేడు సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పాల్గొననున్నారు.

Advertisement

Next Story