వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌‌.. భారత మహిళా షూటర్ తియానాకు స్వర్ణం

by Vinod kumar |
వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌‌.. భారత మహిళా షూటర్ తియానాకు స్వర్ణం
X

బాకు : ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌‌లో భారత మహిళా షూటర్ తియానా సత్తాచాటింది. మహిళల 50 మీటర్ల పిస్టోల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకంతో మెరిసిన ఆమె.. వ్యక్తిగత ఈవెంట్‌లో కాంస్య పతకం కూడా దక్కించుకుంది. అజర్‌ బైజాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం నిర్వహించిన మహిళల 50 మీటర్ల పిస్టోల్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. తియానా(533), సాక్షి(531), కిరణ్‌దీప్ కౌర్‌(509)లతో కూడిన భారత జట్టు 1573 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. చైనా జట్టు 1567 స్కోరుతో రజతం గెలుచుకోగా.. మంగోలియా 1566 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది.

ఇదే ఈవెంట్‌లో వ్యక్తిగత కేటగిరీలో తియానా 533 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. మరో షూటర్ సాక్షి 5వ స్థానంతో సరిపెట్టింది. పురుషుల 50 మీటర్ల పిస్టోల్ ఈవెంట్‌లో రవీందర్ సింగ్ సైతం రెండు పతకాలు సొంతం చేసుకున్నాడు. టీమ్ ఈవెంట్‌లో కమల్‌జీత్, విక్రమ్ జగన్నాథ్ షిండే‌లతోపాటు రవీందర్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. ఫైనల్‌లో భారత జట్టు 1646 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది.

చైనా(1655), కొరియా(1654) జట్లు స్వర్ణ, రజత పతకాలు సాధించాయి. వ్యక్తిగత కేటగిరీలో రవీందర్ సింగ్ 556 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి పతకం ఖాయం చేసుకున్నాడు. కాగా, ఒకే రోజు 4 పతకాలు ఖాతాలో చేరడంతో భారత్ 14 పతకాలతో మెడల్ స్టాండింగ్స్‌లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. చైనా 28 మెడల్స్‌తో టాప్ పొజిషన్‌లో ఉంది.

Advertisement

Next Story