వర్షం కారణంగా భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు

by Harish |
వర్షం కారణంగా భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య రెండో టీ20 వర్షార్పణమైంది. చెన్నయ్ వేదికగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌‌కు వరుణుడు అడ్డుతగలడంతో రద్దైంది. వర్షం కారణంగా తొలి ఇన్నింగ్స్ తర్వాత అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే వరుణుడు అంతరాయం కలిగించాడు. టాస్ పడిన కాసేపటికే వర్షం పడటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. తాజ్‌మిన్ బ్రిట్స్(52) హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఆమెకుతోడు అన్నేకే బోష్ (40) రాణించడంతో సౌతాఫ్రికాకు మంచి స్కోరు దక్కింది. భారత బౌలర్లలో పూజ, దీప్తి రెండేసి వికెట్లతో సత్తాచాటారు. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వరుణుడు మళ్లీ ఆటంకం కలిగించాడు. ఈ సారి వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

మూడు టీ20ల సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి టీ20లో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టీ20లో నెగ్గి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని హర్మన్‌ప్రీత్ సేన భావించింది. అయితే, రెండో టీ20 వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. ఇక, మంగళవారం జరిగే మూడో టీ20లో భారత్ గెలిస్తే సిరీస్‌ను 1-1తో సమం చేస్తుంది. ఓడితే సిరీస్ కోల్పోయినట్టే.

Advertisement

Next Story