భారత్ ఒలింపిక్ బెర్త్ ఆశలు సంక్లిష్టం

by Harish |
భారత్ ఒలింపిక్ బెర్త్ ఆశలు సంక్లిష్టం
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. రాంచీ వేదికగా జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో గురువారం జర్మనీతో ఉత్కంఠగా సాగిన సెమీస్‌లో భారత్ షూటౌట్‌లో ఓడిపోయింది. మొదట మ్యాచ్ 2-2తో సమమవ్వగా.. షూటౌట్‌లో భారత్‌ను 3-4తో జర్మనీ ఓడించింది. సెమీస్‌లో ఓటమితో భారత్‌కు ఒలింపిక్ బెర్త్ దక్కాలంటే తర్వాతి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్‌లో తొలి గోల్ భారత్‌దే. 15వ నిమిషంలో దీపిక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టు ఖాతా తెరిచింది. ఆ తర్వాత జర్మనీ తరపున 27వ నిమిషంలో షార్లెట్ గోల్ చేయడంతో ఫస్టాఫ్ 1-1తో ముగిసింది. అనంతరం 57వ నిమిషంలో షార్లెటే మరో గోల్ చేసి జర్మనీని 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. సమయం దగ్గర పడటంతో భారత్‌ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. అయితే, ఇషికా చౌదరి ఆట ముగియడానికి ఒక్క నిమిషం ముందు 59వ నిమిషంలో గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేసింది. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది. అక్కడ జపాన్ 4 గోల్స్ చేయగా.. భారత్ 3 గోల్స్‌ మాత్రమే చేసింది. దీంతో జపాన్ ఫైనల్‌ చేరుకోవడంతోపాటు పారిస్ ఒలింపిక్స్‌‌కు అర్హత సాధించింది. మరో మ్యాచ్‌లో జపాన్‌‌ను 1-2తో ఓడించిన అమెరికా సైతం ఒలింపిక్ బెర్త్‌ను సాధించింది. ఈ టోర్నీ నుంచి టాప్-3 జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. నేడు మూడో స్థానం కోసం జపాన్‌తో భారత్ చావోరేవో మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించనుంది.

Advertisement

Next Story

Most Viewed