తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. రింకూ, జితేశ్‌కు పట్టలేనంత ఆనందం!

by Vinod kumar |
తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. రింకూ, జితేశ్‌కు పట్టలేనంత ఆనందం!
X

దిశ, వెబ్‌డెస్క్: జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలోని టీమ్‌ ఇండియా మూడు టీ20ల సిరీస్‌ ఆడేందుకు ఐర్లాండ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. నేడు తొలి మ్యాచ్‌ ‘ది విలేజ్‌’ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ఎక్కువగా యువ క్రికెటర్లతో కూడిన జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో సంచలనంగా మారిన టీమ్ ఇండియా యువ ప్లేయర్ రింకు సింగ్ ఐర్లాండ్‌ పర్యటనకు ఎంపికైన సంగతి తెలిసిందే. భారత జట్టుతో కలిసి తొలిసారి బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించి ఐర్లాండ్‌కు చేరుకున్నాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకు సింగ్‌, జితేశ్ శర్మ, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె తదితరులు ఐర్లాండ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా రింకు తొలిసారి బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించడంపై భావోద్వేగానికి గురయ్యాడు. ఇదే విషయంపై మరో యువ క్రికెటర్‌ జితేశ్ శర్మతో మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. రింకు, జితేశ్‌కు సంబంధించిన టీజర్‌ను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

''ప్రతి ఆటగాడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటాడు. నోయిడాలో నా స్నేహితులతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు జట్టులోకి ఎంపికైన విషయం తెలిసింది. వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పా. క్రికెటర్‌గా ఎదగడంలో మా కుటుంబం పాత్ర చాలా కీలకం. జట్టుకు ఎంపికైన తర్వాత నా పేరుతో ఉన్న జెర్సీని, నంబర్‌ను చూసిన తర్వాత ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దీని కోసమే చాలా కష్టపడ్డా'' అని రింకు పేర్కొన్నాడు.

''జితేశ్‌ శర్మ, నేను ఒకేసారి పదేళ్ల కిందట సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలోకి అడుగు పెట్టామని రింకు సింగ్ తెలిపారు. ఇప్పుడు జాతీయ జట్టులోకి కూడా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. అదే విధంగా ఈ ఐర్లాండ్‌ పర్యటనలో ఇంగ్లిష్‌ విషయంలో నాకు సాయంగా ఉంటాడు.. మేమిద్దరం తొలిసారి బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించాం. ఇందులోని సదుపాయాల గురించి తెలుసుకోవడం కాస్త కష్టంగానే అనిపించింది. జట్టులోని ప్రతి ఒక్కరితో మాట్లాడా. వారంతా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆడాలని చెప్పారు. అయితే ఇంగ్లిష్‌లో ఇంటర్వ్యూ ఇవ్వడమే నేను ఒత్తిడిగా భావిస్తానని సంజూ భాయ్‌తో చెప్పా'' అని రింకు సింగ్‌ అన్నారు.


Advertisement

Next Story